Janasena : వినాలి.. ఎమ్మెల్యేలు చెప్పింది వినాలి వీరమల్లు

. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2025-07-23 07:11 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం ఇరవై మంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాల్లో ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కూడా సహకరించడం లేదు. టీడీపీ నేతలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండానే కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో జనసేన ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోవడం లేదని కొందరు అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలసి కూర్చుని మాట్లాడితేనే ఈ సమస్యకు తెరపడుతుందని భావిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలోనే...
గత ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. పవన్ కల్యాణ్ విజయం సాధించిన పిఠాపురం నియోజకవర్గం మినహాయించి మిగిలిన ఇరవై జిల్లాల్లో కూటమి పార్టీలోని నేతలు జనసేన ఎమ్మెల్యేలకు సహకరించడం లేదు. పిఠాపురం నియోజకవర్గంలోనూ మాజీ ఎమ్మెల్యే వర్మ తన వర్గాన్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. అక్కడ కూడా జనసేన, టీడీపీకి పడటం లేదు. పిఠాపురం నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆలోచించాలని కోరుతున్నారు. నాగబాబుతో పాటు ఇతర నేతలు అక్కడకు వెళ్లినప్పుడు టీడీపీ కార్యకర్తలు చేసే నినాదాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఎమ్మెల్యే బొలిశెట్టి వ్యాఖ్యలు వింటే...
ఇక తాజాగా తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. వివాదాల విషయంలో మాట్లాడాలి అంటే తాను డైరెక్ట్ గానే మాట్లాడతానని, అసలు ఇరవై ఒక్క జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో తెలుసా? అని బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తాకాయి. అందర్నీ ఒకచోట కూర్చోబెట్టి చర్చ పెడితే డి అప్పుడు తెలుస్తుంది తమ బాధ ఏంటో అని ఆయన అన్నారు. కలసి ఉంటే అందరికీ మంచిదని, లేదంటే.. వచ్చే ఐదేళ్లు అందరూ అడుక్కోవాల్సి వస్తుందని కూడా బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన హెచ్చరికలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి. కూటమి ధర్మం ప్రకారం అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉండాలని కోరారు.
పవన్ మాత్రం...
మరొక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం ఆగస్టు నెల నుంచి పార్టీ పటిష్టతపై దృష్టి పెడతానని తెలిపారు. పవన్ కల్యాణ్ మాత్రం కూటమిలోని మూడు పార్టీలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు సమన్వయంతో పనిచేస్తే సరిపోదని, కింది స్థాయిలో సమన్వయం ఉండాలని జనసేన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. నియోజకవర్గాల్లో తమ పరిస్థితిని తెలుసుకుంటే పవన్ కల్యాణ్ అలా మాట్లాడరని అంటున్నారు. మొత్తం మీద త్వరలోనే జనసేన ఎమ్మెల్యేలు పవన్ కల్యాణ్ కు తమ పరిస్థితులు వివరించి కూటమిలో పార్టీల సమన్వయానికి కృషి చేయాలని కోరేందుకు సిద్ధమయినట్లు సమాచారం.


Tags:    

Similar News