24 గంటల్లో మరో అల్పపీడనం.. నాలుగురోజులు కుంభవృష్టి ?

మరోవైపు.. రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని .. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా..

Update: 2023-07-23 10:40 GMT

low pressure in bay of bengal

ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి.. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు ఈ ఆవర్తనం ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్ధిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ లో మోస్తరు వర్షం కురవవచ్చని ఐఎండీ అంచనా వేసింది.

మరోవైపు.. రానున్న 24 గంటల్లో మరో అల్పపీడనం ఏర్పడనుందని .. ఉపరితల ఆవర్తనం, అల్పపీడనంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు మరో నాలుగు రోజుల వరకూ సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. రేపు ఏర్పడే ఈ అల్పపీడన ద్రోణి ప్రభావం తెలంగాణ, కోస్తాంధ్రలపై అధికంగా ఉండనుందని తెలిపింది. ముఖ్యంగా కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ..రాయలసీమలో కర్నూల్, నంద్యాల, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇదేసమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. రానున్న 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కుంభవృష్టి తప్పదన్న సంకేతాలొస్తున్నాయి.
ఉత్తరాదిని ఇంకా భారీవర్షాలు వణికిస్తున్నాయి. ఢిల్లీకి మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. యమునానదికి వరదనీరు పోటెత్తడంతో ఉగ్రరూపం దాల్చింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇండోర్, రత్లాం, చింద్వారా, మందసౌర్ ప్రాంతాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.


Tags:    

Similar News