Ap Politics : వైఎస్ షర్మిలను కలవడంలో సాయిరెడ్డి ఆంతర్యమేంటి?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

Update: 2025-02-02 04:30 GMT

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో వీరి భేటి జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. వైఎస్ షర్మిల ఇంటికి వెళ్లిన విజయసాయిరెడ్డి అక్కడే భోజనం చేసి అనేక విషయాలపై చర్చించినట్లు చెబుతున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లండన్ నుంచి బెంగళూరుకు వచ్చే ముందే ఈ పర్యటన జరిగినట్లు తెలిసింది. ఇందుకు రాజకీయ కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి, వైఎస్ షర్మిల ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న రోజులను కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. వీరి భేటీ ఏ వైపునకు దారితీస్తుందన్న చర్చ జరుగుతుంది.

రాజీనామా చేసిన తర్వాత...?
వైసీపీ రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి తాను వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన కర్ణాటకలో తాను వ్యవసాయం చేసుకుంటున్నట్లు సోషల్ మీడియాలోనూ ఫొటోలు పోస్టు చేశారు. తాను ఇక రాజకీయాలను పట్టించుకోనని తెలిపారు. అలాగని వైఎస్ జగన్ ను విమర్శించలేదు. తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సందర్భంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో కూడా తనకు విభేదాలు లేవంటూ ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ను తీవ్రంగా విమర్శిస్తున్న వైఎస్ షర్మిలను కలవడంతో ఏం జరిగి ఉంటుందన్న దానిపై వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
ఇద్దరూ కలయికపై...
జగన్ ఆస్తుల విషయంలోనూ విజయసాయిరెడ్డి వైఎస్ జగన్ పక్షాన నిలిచారు. షర్మిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత కూడా షర్మిల ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే జగన్, షర్మిల మధ్య రాజీ కుదర్చడానికి ఆయన భేటీ అయ్యారా? లేక షర్మిలకు తాను చేసిన వ్యాఖ్యల వెనక ఉన్న వాస్తవాలను వివరించడానికి కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఇప్పటికే వైసీపీ క్యాడర్ లో కొంత నిరాశగా ఉంది. ఈ సమయంలో షర్మిలతో భేటీ కావడంతో జగన్ కుటుంబంలో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ భేటీని అంత తేలిగ్గా కొట్టిపారేయడం లేదు. షర్మిల కూడా విజయసాయిరెడ్డి విషయంలో సానుకూలతను ప్రదర్శించడంపై ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.



Tags:    

Similar News