Tadipathri : మళ్లీ తాడిపత్రికి పెద్దారెడ్డి... రానిస్తారా? అడ్డుకుంటారా?
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తనను తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టేందుకు పోలీసులు అనుమతించాలని కోరుతున్నారు. ఇప్పటి వరకూ తాను తాడిపత్రికి వెళ్లితీరతానని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. ఆయన హైకోర్టుకు వెళ్లారు. అక్కడ సింగిల్ బెంచ్ తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించినా తర్వాత డివిజన్ బెంచ్ కు పోలీసులు వెళ్లారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశముందని చెప్పడంతో డివిజన్ బెంచ్ పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతిని నిరాకరించింది. గతంలో ఇచ్చిన సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే విధించింది.
పోలీసులతో కలసి...
తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య ఒక విధంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. తాడిపత్రి నియోజకవర్గంలోకి వెళ్లేందుకు తనను అనుమతించకపోవడంపై పెద్దారెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలో ఉండి పోలీసులను అడ్డం పెట్టుకుని తనకు అడ్డుకుంటున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు. గత ఎన్నికల్ల తనకు కూడా తాడిపత్రి ప్రజలు ఓట్లు వేశారన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తాను తన సొంత ఇంటికి వెళ్లేందుకు అనుమతిని కూడా ఇవ్వకుండా పోలీసులతో కుమ్మక్కై ఈ ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తుందన్న ఆరోపణలను ఆయన నేరుగా చేస్తున్నారు. ఈ సమయంలో పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో రెండు, మూడు రోజుల్లో తాడిపత్రికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
బాధితులే అడ్డుకుంటున్నారని...
అయితే తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఆయన బాధితులే అడ్డుకుంటారని హాట్ కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అనేక అరాచకాలు, అక్రమాలు చేశాడని, గత ప్రభుత్వంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి కోమటికుంట్లలో 180 ఎకరాలు ఆక్రమించుకున్నాడని, తాడిపత్రి అంటే తమకు ఒక దేవాలయం, తాడిపత్రి ప్రజలు తమకు దేవుళ్ళని అంటున్నారు. తాడిపత్రికి మంచి చేశాం కాబట్టే 40 ఏళ్లుగా ప్రజలు తమ కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారని, గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మరోసారి తాడిపత్రి టెన్షన్ పోలీసులకు ఇబ్బందికరంగా మారనుంది.