Pedda Reddy : తాడిపత్రికి చేరుకున్న పెద్దారెడ్డి.. అడుగుపెట్టిన తర్వాత ఏం చేశారంటే?

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఆయన తాడిపత్రిలోని తన ఇంటి వద్దకు చేరుకున్నారు.

Update: 2025-09-06 07:39 GMT

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఆయన తాడిపత్రిలోని తన ఇంటి వద్దకు చేరుకున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య తాడిపత్రికి చేరుకున్న పెద్దారెడ్డి తన ఇంట్లోకి వెళ్లి తనకు సంబంధించిన ముఖ్యమైన నేతలతో మాట్లాడారు. దాదాపు పదిహేను నెలల తర్వాత తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్న పెద్దారెడ్డి తన పంతం నెరవేర్చుకున్నట్లయింది. గత కొన్ని నెలలుగా తాడిపత్రికి వచ్చేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు అంగీకరించడం లేదు. శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావించి ఆయనను ముందే అడ్డుకుంటున్నారు. దీంతో ఆయన తాడిపత్రిలోకి రాలేకపోయారు.

సవాళ్ల మధ్య...
మరొకవైపు ప్రత్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు కూడా దమ్ముంటే తాడిపత్రికి చేరుకోవాలని పెద్దారెడ్డికి సవాల్ విసురుతున్నారు. అదే సమయంలో పోలీసులను అడ్డం పెట్టుకుని రాకూడదని,దమ్ముంటే ఒంటరిగా రావాలని కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనను తాడిపత్రికి రానివ్వకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సింగిల్ బెంచ్ అనుమతించినప్పటికీ, డివిజనల్ బెంచ్ అనంతపురం పోలీసులు వేసిన పిటీషన్ పై విచారించి దానిపై స్టే ఇచ్చింది. దీంతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాడిపత్రిలోకి పెద్దారెడ్డిన బందోబస్తు ఇచ్చి తీసుకెళ్లాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
నలభై మంది అనుచరులతో...
ఈరోజు తాడిపత్రిలోని తన సొంత ఇంటికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పదిహేను నెలల తర్వాత తన సొంత ఇంటికి చేరుకోవడం ఆనందంగ ఉందని తెలిపారు. తనకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు భద్రత కల్పించారని చెప్పారు. తాను తాడిపత్రిలో ఉన్న సమస్యలను ప్రజలతో చర్చించి వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తన నలభై మంది అనుచరులతో తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చేరుకన్నారు. తిమ్మంపల్లిలోని గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఆయన తాడిపత్రికి వచ్చారు. తాడిపత్రిలో మాత్రం ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు తాడిపత్రిలో భారీగా పోలీసులను మొహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News