మళ్లీ జవహర్ పుంజుకుంటున్నట్లుందిగా? హైకమాండ్ ను ప్రసన్నం చేసుకుంటున్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అందులో తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ మళ్లీ అధిష్టానానికి దగ్గరయ్యారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, అందులో తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రి కేఎస్ జవహర్ మళ్లీ అధిష్టానానికి దగ్గరయ్యారు. ఆయన వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం ఇప్పటి నుంచే తన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుంది. కేఎస్ జవహర్ కు 2024 లో జరిగిన ఎన్నికల్లో టిక్కెట్ దక్కలేదు. ఆయన 2014లో కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఉపాధ్యాయ వృత్తి చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన జగన్ వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడమే కాకుండా మంత్రి పదవి కూడా వరించింది. అయితే కొవ్వూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలతో పొసగక పోవడంతో ఆయన రాజకీయ జీవితంలో స్పీడ్ కు కొంత ఫుల్ స్టాప్ పడినట్లయిందన్నది వాస్తవం.
గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కక...
కొవ్వూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కె. జవహర్ ను అక్కడి నేతలు వ్యతిరేకించడంతో 2019 ఎన్నికలలో ఆయనను తిరువూరుకు చంద్రబాబు పంపించారు. అయితే అక్కడ ఆయన వైసీపీ అభ్యర్థి రక్షణ నిధి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే తిరువూరు మొన్నటి ఎన్నికల్లో కొలికపూడి శ్రీనివాసరావుకు కేటాయించారు. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న కొలికపూడికి టిక్కెట్ ఇవ్వడంతో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే తిరువూరు లో కొలికపూడికి, అక్కడి పార్టీ నేతలకు, క్యాడర్ కు పడకపోవడం, అనేక వివాదాలు చోటు చేసుకుంటుండటంతో జవహర్ చూపు తిరిగి తిరువూరు పై పడిందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జవహర్ తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
తిరువూరు ముద్దు అని...
కొవ్వూరు కంటే ఆయనకు తిరువూరు పైనే ప్రస్తుతం దృష్టి ఉన్నట్లు కనపడుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత చంద్రబాబు భర్తీ చేసిన నామినేటెడ్ పోస్టుల్లో జవహర్ కు కీలకమైన పోస్టు లభించింది. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమితులయ్యారు. కొవ్వూరు నియోజకవర్గంలో బలమైన కమ్మ సామాజికవర్గానికి చెందిన నేతలు తనను తిరిగి కొవ్వూరుకు రానివ్వరన్న నమ్మకంతో ఆయన తిరువూరునే ఎంచుకుంటున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆయన సన్నిహితుల వద్ద కూడా తాను తిరువూరును ఎంచుకుంటానని చెబుతుననట్లు తెలిసింది. జవహర్ ను ఎన్నికల సమయంలో రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా నియమించారు. అయినా సరే కొవ్వూరు వద్దు.. తిరువూరు ముద్దు అంటున్నారట జవహర్. మరి చంద్రబాబు నాలుగేళ్ల తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియకపోయినా తన ప్రయత్నంలో లోపం లేకుండా చూసుకుంటున్నారట.