Andhra Pradesh : కూటమి సర్కార్ లోనూ ఫ్యాన్ నేతలు చక్రం తిప్పుతున్నారా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పదిహేడు నెలలవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయి పదిహేడు నెలలవుతుంది. అయితే ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నది వైసీపీ నియమించిన వారేనట. ఈ మాటలన్నది ఎవరో కాదు. స్వయానా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రతి జిల్లాలో తన మనుషులను నియమించుకున్నాని, వారే జిల్లాల్లో ఇప్పటికీ రేషన్ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. కృష్ణా జిల్లాలోనూ రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నది గత ప్రభుత్వ హయాంలో కొడాలి నాని వద్ద ఉన్న ఒక వ్యక్తి అని, అతనే ఇప్పుడు కేశినేని చిన్ని కార్యాలయంలో కూర్చుని ఈ మాఫియాను నడుపుతున్నారని ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ లు...
కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయనకు రాష్ట్ర రాజకీయాలపై ఒక అవగాహన ఉందని అంటున్నారు. అందుకే ఆయన చేసిన ఆరోపణలను ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో కూడా కొందరు వ్యతిరేకిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు రెండేళ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ వైసీపీ నేతల మనుషులే రేషన్ బియ్యం మాఫియాను నడుపుతుండటం సిగ్గుచేటని కామెంట్స్ పెడుతున్నారు. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాల్సిందిబోయి వారిని అక్కున చేర్చుకోవమేంటని టీడీపీ అభిమానులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే వైసీపీ పాలనకు, కూటమి పాలనకు తేడా ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
నాదెండ్లకు తగిలినట్లేనా?
ప్రతి జిల్లాలో ఒక మనిషిని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియమించుకున్నారని, వారి ద్వారా రేషన్ డీలర్ల ను బెదిరించి ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై ఇప్పుడు జనసేనకు కూడా చుట్టుకుంది. జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు జిల్లా నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలు నాదెండ్లకు ఆగ్రహాన్ని తెప్పించాయి. తాజాగా కొలికపూడి చేసిన వ్యాఖ్యలతో ఆయన మరింత కోపానికి గురయినట్లు తెలిసింది. మొత్తం మీద కూటమిలో ఇప్పటికీ వైసీపీ నేతల హవా నడుస్తుందన్న కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో మంటలు రేపుతున్నాయి. చంద్రబాబు వచ్చిన తర్వాత దీనికి ఫుల్ స్టాప్ పడుతుందని భావిస్తున్నారు.