Anhdra Pradesh : కల్తీ మద్యం కేసులో ఊహించని ట్విస్టులు.. ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్నాయా?
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది
ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది. జోగి రమేష్ ఈ కేసులో ప్రధాన కారకుడుగా ఏ1 నిందితుడు జనార్థన్ రావు చేసిన ఆరోపణలు ఇప్పుడు ఫ్యాన్ పార్టీని షేక్ చేస్తున్నాయి. తాను వైసీపీ హయాంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశానని జనార్థన్ రావు ఎక్సైజ్ విచారణలో తెలిపారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఆ కార్యక్రమాన్ని మానేశానని చెప్పుకొచ్చారు. అయితే జోగి రమేష్ ఫోన్ చేసి టీడీపీ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరకాటంలో పెట్టేందుకు తిరిగి నకిలీ మద్యం తయారు చేయాలని చెప్పడంతోనే తాను తిరిగి ఈ పనికి పూనుకున్నానని నిందితుడు జనార్థన్ రావు చెప్పడం వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టేలా కనిపిస్తుంది.
కల్తీ మద్యం కేసులో...
ములకలచెరువు మద్యం కల్తీ మద్యం కేసులో జనార్థన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జనార్థన్ రావు వీడియో ఒకటి బయటకు రావడంతో సంచలనంగా మారింది. మాజీ మంత్రి జోగి రమేష్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆపానని జనార్థన్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. తనకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ ఫోన్ చేసి నకిలీ మద్యాన్ని తయారు చేయాలని కోరినట్లు జనార్థన్ ఎక్సైజ్ అధికారుల విచారణలో తెలిపినట్లు ఆ వీడియోలో జనార్థన్ రావు చెప్పడాన్ని బట్టి చూస్తే జోగి రమేష్ చుట్టూ కల్తీ మద్యం ఉచ్చు ఆయన చుట్టూ బిగుసుకుంటుందని చెప్పొచ్చు. మరొకవైపు జనార్థన్ రావు ఫోన్ పోయిందని చెప్పినా సిమ్ ను యాక్టివ్ చేసే పనిలో ఎక్సైజ్ అధికారులున్నారు.
వైసీపీ వైపు టర్న్ అవుతుందా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసులో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మొన్ననే జోగి రమేష్ అన్నారు. కొందరిని ఇరికించే కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. దానికి తగినట్లుగానే జనార్థన్ రావు కూడా జోగి రమేష్ పేరు చెప్పడంతో ఆయనను విచారించేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జోగి రమేష్ ను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతుంది. 2021లోనే విజయవాడకు సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారు చేశానని జనార్థన్ ఒప్పుకోవడం, జోగి రమేష్ ప్రమేయం ఉందని చెప్పడంతో నకిలీ మద్యం కేసు వైసీపీ వైపు టర్న్ అయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ నేతలు మాత్రం జనార్థన్ రావు వీడియో చూస్తుంటే కుర్చీలో కూర్చోబెట్టి కావాలని చెప్పించినట్లు కనపడుతుందని అంటున్నారు. తమపై బురదను కడుక్కోలేక వైసీపీపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.