Andhra Pradesh : విద్యుత్ స్మార్ట్ మీటర్లు కావివి.. గిర్రున తిరిగే మోటార్లు

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు మోత మోగిపోతున్నాయి, స్మార్ట్ మీటర్ల కారణంగా అధిక విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి

Update: 2025-06-09 03:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు బిల్లులు మోత మోగిపోతున్నాయి. అసలే పెరిగిన విద్యుత్తు ఛార్జీలతో అల్లాడుతున్న ప్రజలు స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత మరింత ఎక్కువయ్యాయి. అన్నమయ్య జిల్లాలో ఒక రైస్ మిల్ కు సంబంధించిన విద్యుత్తు బిల్లు నెట్టింట వైరల్ గా మారింది. గతంలో నెలకు తొమ్మిది నుంచి పది వేల రూపాయలు మాత్రమే వచ్చే విద్యుత్తు బిల్లు ఈసారి స్మార్ట్ మీటర్ బిగించిన తర్వాత 99 వేల రూపాయలు వచ్చింది. దీంతో మిల్లు యజమాని లబోదిబోమంటూ అధికారుల వద్దకు పరుగులు తీసినా తాము ఏమీ చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల స్మార్ట్ మీటర్లు కారణంగా అధికంగా విద్యుత్తు బిల్లులు వస్తుండటంతో ప్రజలు రోడ్డు పైకి వచ్చి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత...
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. గత ప్రభుత్వం నిర్వాకం కారణంగానే ఈ ఛార్జీల పెంపుదల అంటూ కొంత నచ్చచెప్పే ప్రయత్నం కూటమి సర్కార్ చేయగలిగింది. గత ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోవడం, జెన్ కో, ట్రాన్స్ కోలను పూర్తిగా నిర్వీర్యం చేసిన కారణంగానే ఆ పాపం ఇప్పుడు ప్రజలను వెంటాడుతుందని విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెబుతున్నారు.దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా కొన్ని వ్యాపార సముదాయాలకు, నివాసాలకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసింది. అసలే ధరలు పెరగడం.. మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో నెలవారీ బిల్లు ఒక్కసారిగా పెరిగిపోయింది.
నేడు గొట్టిపాటి ఎమెర్జెన్సీ మీటింగ్...
తొలి సారి స్మార్ట్ మీటర్ విశాఖలో ఏర్పాటు చేశారు. తర్వాత దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలులో తేవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రీఛార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్ గా నిలిచిపోతుంది. తిరిగి మనకు అవసరమైనంత మేర రీ ఛార్జ్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొదటి స్మార్ట్ మీటర్‌ను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, విశాఖ ప్రజారోగ్య శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసింది. నంద్యాలలో కూడా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేశారు. ఈ మీటర్‌కు మనం ముందుగానే రీఛార్జి చేసుకోవాలి.అయితే స్మార్ట్ మీటర్ల కారణంగా ఎక్కువ విద్యుత్తు బిల్లులు వస్తున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తుండటంతో నేడు విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ డిస్కంలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే అధిక బిల్లులపై నివేదికను కోరిన మంత్రి గొట్టిపాటి స్మార్ట్ మీటర్ల పనితీరును అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు.
Tags:    

Similar News