Dharmavaram : సత్యకుమార్ కు ఈ తలనొప్పులేంటి? వరసగా తలెత్తుతున్న విభేదాలతో

ధర్మవరం నియోజకవర్గం ఎన్నికలు జరుగుతున్న దగ్గర నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు

Update: 2025-08-25 06:59 GMT

ధర్మవరం నియోజకవర్గం ఎన్నికలు జరుగుతున్న దగ్గర నుంచి నిత్యం వార్తల్లోనే నిలుస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య పొసగడం లేదు. అలాగే టీడీపీ నేతలు కూడా గ్రూపులుగా విడిపోయి వీధుల్లోకి దిగుతుండటం మంత్రికి తలనొప్పిగా మారింది. ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల్లో సఖ్యత లేకపోవడంతో పాటు నియోజకవర్గం టీడీపీలో గ్రూపు తగాదాలు రచ్చ రేపుతున్నాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీజేపీలో వెళ్లడంతో అక్కడ ఇన్ ఛార్జి బాధ్యతలను పరిటాల శ్రీరామ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పగించారు.

ఎన్నికల నాటి నుంచి...
అయితే మొన్నటి ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం కూటమి పార్టీల్లో పొత్తులో భాగంగా బీజేపీకి వెళ్లిపోయింది. సత్యకుమార్ యాదవ్ బీజేపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి నియోజకవర్గంలో ఏదో ఒక విషయంలో విభేదాలు కూటమి నేతల మధ్య తలెత్తుతూనే ఉన్నాయి.మొన్నటి వరకూ సత్యకుమార్ మాత్రం వైసీపీ స్థానిక నేతలను దగ్గరకు తీసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. టీడీపీ, జనసేన కంటే వైసీపీ నేతలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనకూలంగా వ్యవహరించిన మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునను ధర్మవరానికి సత్యకుమార్ తీసుకురావడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి ఆవివాదం సద్దుమణిగిందని భావించిన సమయంలో మరొక వివాదం చుట్టుముట్టింది.
టీడీపీ నేతల మధ్య...
మరోసారి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలలో గ్రూప్ వార్ మొదలయింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య యుద్ధం మొదలయింది. బత్తలపల్లి మండలం నల్లబోయినపల్లి వద్ద ఘటన జరిగింది. టీడీపీ నేతలు విశ్వనాథ నాయుడు, గంటాపురం జగ్గు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. బొగ్గు వ్యాపారుల నుంచి కమీషన్ల కోసం పరిటాల వర్గీయుల మధ్య ఆధిపత్యపోరు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరస్పరం ఇనుపరాడ్లు, కర్రలతో పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేసుకున్నారని చెబుతన్నారు. ఇరువర్గాల దాడిలో రెండు వాహనాలు ధ్వంసం కాగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చేందుకు పోలీసుల ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతల ఫైట్ దృశ్యాలు వైరల్ కావడంతో సైకిల్ పార్టీలో విభేదాలు రోడ్డుకెక్యాయి.


Tags:    

Similar News