Devineni : అవినాష్ దారి మార్చినట్లుందిగా?

వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు.

Update: 2025-10-15 08:56 GMT

వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ ఈసారి నియోజకవర్గం మార్చబోతున్నారు. దేవినేని నెహ్రూ కుమారుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దేవినేని అవినాష్ ఇప్పటి వరకూ చట్టసభల్లో అడుగు పెట్టలేదు. ఒకప్పుడు విజయవాడ రాజకీయాలను ఒక ఊపు ఊపిన దేవినేని కుటుంబం ఇప్పుడు గెలుపు కోసం పరితపించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దేవినేని నెహ్రూ విషయంలో అలా జరగలేదు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక పదవులు అనుభవించారు. దమ్మున్న నేతగా జనంలో ముద్ర పడ్డారు. కానీ ఆయన తనయుడు దేవినేని అవినాష్ కు మాత్రం రాజకీయాలు కలిసి రావడం లేదనే అనిపిస్తుంది. ఆయన గత కొన్ని ఎన్నికల నుంచి పోటీ చేయడం ఓటమి పాలు కావడం సాధారణంగా మారింది.

మూడు సార్లు పోటీ చేసి...
దేవినేని నెహ్రూ జీవించి ఉన్న సమయంలోనే 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2016 లో తన తండ్రి నెహ్రూతో కలసి దేవినేని అవినాష్ టీడీపీలో చేరారు. నాడు టిక్కెట్ దక్కకపోయినా రాష్ట్ర టీడీపీ యువత అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు నియమించారు. 2019 ఎన్నికల్లో గుడివాడ టిక్కెట్ దక్కింది. టీడీపీ నుంచి పోటీ చేసిన దేవినేని అవినాష్ నాటి ఎన్నికల్లో కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత ఆయన అదే ఏడాది వైసీపీలో చేరారు. దేవినేని అవినాష్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ ఛార్జిగా వైసీపీ అధినేత జగన్ నియమించారు. ఆ రకంగా టిక్కెట్ దక్కుతుందని ఆయన భావించారు.
పెనమలూరు నుంచి...
2024 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ పేరును ప్రకటించారు.కానీ ఆ ఎన్నికల్లో దేవినేని అవినాష్ తో పాటు వైసీపీ కూడా అధికారం కోల్పోయింది. దీంతో పాటు అనేక కేసులు దేవినేని అవినాష్ పై నమోదయ్యాయి. అదే సమయంలో తూర్పు నియోజకవర్గం కంటే తనకు పెనమలూరు నియోజకవర్గం బెటర్ అని పార్టీ అధినేత జగన్ కు చెప్పినట్లు తెలిసింది. పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. తన తండ్రి దేవినేని నెహ్రూ గతంలో కంకిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో అక్కడ తనకు బలమైన ఓటు బ్యాంకు ఉందనినమ్ముతున్నారు. మరి జగన్ పెనమలూరు విషయంలో దేవినేని అవినాష్ కోరికను తీరుస్తారా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News