Vemireddy : వేమిరెడ్డి నిర్ణయం అందుకేనా? ఉన్నమంచిపేరు పోతుందనే భయమా?

నెల్లూరు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయమేనని అంటున్నారు

Update: 2025-08-01 07:04 GMT

నెల్లూరు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయమేనని అంటున్నారు. ఇకపై తాను మైనింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని వేమిరెడ్డి ప్రకటించారు. క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకుంటున్నానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. తనకు మైనింగ్ చేసే ఉద్దేశ్యమే లేదన్నారు. అలాగే క్వార్జ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్న ఆలోచనను కూడా విరమించుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిర్భవించారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ పార్టీలో ఆయన చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. తర్వాత 2019 నుంచి 2024 వరకూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలకంగానే వ్యవహరించారు.

సేవా కార్యక్రమాలతో...
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలతో నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితులు. ఆయన నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తాను ఎంపీ కాకముందు నుంచే తాగునీటి పథకాలను ప్రారంభించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేవారు. వీపీఆర్ ఫౌండేషన్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలను నిర్వహించుతూ వచ్చారు. కానీ 2019కి ముందు ఆయనకు రాజకీయాల్లోకి రావాలని గుబులు రేగి వైసీపీలో చేరి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే 2019 నుంచి 2024 వరకూ నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పొసిగేది కాదు. దీంతో గ్యాప్ పెరిగింది. దీంతో పాటు తాను కోరిన స్థానాలు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
టీడీపీలో చేరినా...
తెలుగుదేశం పార్టీలో చేరి 2024 లో నెల్లూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.అయితే ఆయన మీద పదే పదే మైనింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థిపార్టీ నేతలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం ఆయనను కలసి వేసిందంటున్నారు ప్రతిపక్షాలకు, స్వపక్షంలోని తనకు వ్యతిరేకులైన వారికి అవకాశమివ్వకూడదని పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్లు సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకున్న తమ కుటుంబం ఇలా అక్రమ వ్యాపారాలు పేరిట తాము బద్నాం కావడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News