Tiruamala : నేడు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే వారు ఎన్ని గంటలు వేచి ఉండాలంటే?

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా భక్తులు శనివారం పెరగడంతో కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు

Update: 2024-11-23 02:33 GMT

 Heavy rush at Tirumala with devotees waiting in 16 compartments. Free darshan takes 8 hours; special darshan 2-3 hours.

తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. ఒక్కసారిగా భక్తులు శనివారం పెరగడంతో కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎక్కువ సమయం వేచి చూడాల్సి వస్తుంది. శనివారం కావడంతో సహజంగా తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తిరుమలలో నేడు ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఉదయం పదకొండు గంటలకు శ్రీవాణి దర్శన టిక్కెట్లను, మధ్యాహ్నం మూడు గంటలకు వయో వృద్ధులు, వికలాంగుల దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్నారు. ఎల్లుండి ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదలవుతాయి. మధ్యాహ్నం మూడు గంటలకు వసతి గదుల కోటాను అధికారులు ఆన్ లైన్ విడుదల చేయనున్నారు. ఆన్ లైన్ లో విడుదల చేయగానే హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి.

నేడు 16 కంపార్ట్ మెంట్లలో...
తిరుమల శ్రీవారి దర్శనం కోసం సుదూరం నుంచి వచ్చే భక్తులు ముందుగానే దర్శన టిక్కెట్లను బుక్ చేసుకుంటారు. వసతి గృహాలు కూడా ముందుగానే బుక్ అవుతాయి. అందువల్లనే ఈ టిక్కెట్లను ఆన్ లైన్ లో పెట్టిన వెంటనే భక్తులు కొనుగోలు చేస్తారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఈరోజు ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,731 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 22,890 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. రేపు కూడా ఇదే మాదిరి రద్దీ కొనసాగే అవకాశముంది.


Tags:    

Similar News