ఆ నాలుగేళ్లు సాక్షికి నవశకం.. జ్యోతికి నరకం

ఈ నాలుగేళ్ల గురించి సాక్షి పత్రిక నవశకం అంటూ చెప్పుకొచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని

Update: 2023-05-30 06:11 GMT

సీఎం వైఎస్ జగన్ మోహన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తీ అయింది. జగన్ నేటితో ముఖ్యమంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలను చేపడుతున్నాయి. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాలను తాకే విధంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. 2019లో నాలుగేళ్ల క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను వైసీపీ 151 స్థానాల్లో గెలుపొందింది. ఇదే సమయంలో 25 లోక్ సభ స్థానాలకు గాను 22 స్థానాల్లో గెలుపొందింది. ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలను 98.4 శాతం పూర్తి చేశామని వైసీపీ చెబుతోంది. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. ఇప్పటి వరకు వివిధ పథకాల ద్వారా దాదాపు 2.10 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వేసినట్టు ప్రభుత్వం చెపుతోంది. పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు ఈరోజుని సెలెబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. అన్న దానం, వస్త్రదానం వంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాలు ఈ సందర్భంగా చేపట్టనున్నారు.

ఈ నాలుగేళ్ల గురించి సాక్షి పత్రిక నవశకం అంటూ చెప్పుకొచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలుచేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలు అందిస్తూ ఉన్నారని తెలిపారు. రేషన్‌ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్‌ల వరకూ కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందజేస్తూ అందరి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందని సాక్షి తెలిపింది. వైసీపీ నాలుగేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చూస్తోందని సాక్షి పత్రికలో తెలిపారు. సచివాలయ వ్యవస్థ దేశంలోనే ఒక చరిత్ర. ప్రభుత్వాఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే సంప్రదాయానికి జగన్‌ సర్కార్‌ స్వస్తి పలికింది. ప్రతి రెండువేల మంది జనాభాకు గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసింది. ఎలాంటి సమస్యనైనా గ్రామం నుంచే పరిష్కరించుకునేలా చేసిందని.. ఎంతో మంది లబ్ది దారులకు అండగా నిలిచామని వైసీపీ చెబుతోంది. దాదాపు 2.10 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి పంపింది వైసీపీ ప్రభుత్వం. ఇవన్నీ వైసీపీకి ప్లస్ అని అంటున్నారు.
ఇక వైసీపీ ఏ పని చేసినా ఏకి పారేసే ఆంధ్రజ్యోతిలో నాలుగేళ్ల నరకం అంటూ స్పెషల్ స్టోరీని ఉంచారు. ఏపీ ప్రజలు నరకంలో నాలుగేళ్లుగా ఉంటున్నారని ఆంధ్రజ్యోతి చెప్పింది. నాలుగేళ్ల జగన్‌ పాలన నవ్యాంధ్రకు నరకం చవిచూపిస్తోందంటూ కథనంలో చెప్పుకొచ్చింది. ఈ తరంలో అనేక మందికి అత్యవసర పరిస్థితిని చూపించారు జగన్ అని తెలిపింది. భయానక, క్రూరమైన చట్టాలను రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అమరావతి రాజధానిలో ప్రజలు నిత్యనరకాన్ని అనుభవిస్తున్నారంటూ తెలిపింది. ఏపీలో నిరసన తెలిపే హక్కు పోలీసు బూటుకాళ్లకింద నలిగిపోతోందని ఆంధ్రజ్యోతి చెప్పుకొచ్చింది.
అదే ఆంధ్రజ్యోతి ఇటీవల మహానాడులో టీడీపీ ప్రవేశ పెట్టిన మినీ మేనిఫెస్టోను ఆహా.. ఓహో.. అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉండడం ఆశ్చర్యకరమే..! ఇంకా ఎన్నికలు జరగలేదు.. టీడీపీ అధికారం లోకి రాలేదు.. మేనిఫెస్టోను అమలు చేయలేదు.. అయినా కూడా టీడీపీ తీసుకుని వచ్చిన మేనిఫెస్టోపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంది. ఏది ఏమైనా ఆంధ్రజ్యోతి తీరే వేరయా అని అనుకుంటూ ఉన్నారు జనం. ఏది ఏమైనా జగన్ నాలుగేళ్ల పాలన సాక్షికి నవశకం కాగా.. జ్యోతికి నరకం అని అనిపిస్తూ ఉంది.


Tags:    

Similar News