TDP : అధికారంలోకి వచ్చినా ఆనందం లేదా?

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది

Update: 2026-01-08 08:04 GMT

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. వైసీపీ నుంచి నేతలను చేర్చుకోవడమే కాకుండా వారికే ప్రాధాన్యత దక్కుతుండటాన్ని చింతమనేని ప్రభాకర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆళ్లనాని తో పాటు ఏలూరు కార్పొరేషన్ మేయర్ కుటుంబం టీడీపీలో చేరే సమయంలోనే చింతమనేని ప్రభాకర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము గత ఐదేళ్ల పాటు ఎన్నో కేసులు ఎదుర్కొని, వారి చేత మాటలు పడి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి, చివరకు జైలు జీవితం కూడా గడిపి వస్తే నేడు అధికారం కోల్పోయిన వెంటనే వారిని పార్టీలో చేర్చుకోవడంపైన కూడా చింతమనేని ప్రభాకర్ అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.

దూకుడుగా ఉండే...
చింతమనేని ప్రభాకర్ మామూలుగా దూకుడుగా ఉండేవారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం తన నియోజకవర్గం పరిధిలో మాత్రమే ఆయన రెస్పాండ్ అవుతున్నారు. అందులోనూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విషయంలోనే ఆయన యాక్టివ్ గా కనిపిస్తున్నారు తప్పించి జిల్లాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల పట్ల ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిసింది. జనసేన ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ నాయకత్వం కూడా వైసీపీ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడమేంటని చింతమనేని వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్నిబాధలు పడి, జెండాను వదలకుండా పార్టీ కోసం పనిచేస్తే చివరకు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆనందం లేకుండా పోయిందని అంటున్నారు.
ఈ రెండేళ్లలో...
అందుకే చింతమనేని ప్రభాకర్ అధినాయకత్వానికి కూడా ఇటీవల కాలంలో టచ్ మి నాట్ అన్న తరహాలోనే ఉన్నారు. ఏదైనా పార్టీ కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు ఆయన పనిచేసుకుంటూ వెళుతున్నారు. అయితే త్వరలో సంక్రాంతి పండగ వస్తుండటంతో ఆయన ఆ బిజీలో ఉన్నారని, చింతమనేని ప్రభాకర్ ప్రత్యేకంగా సంక్రాంతి పండగకు ప్రత్యేకంగా బరులను ఏర్పాటు చేసి కోడి పందేలను నిర్వహిస్తుండటం సంప్రదాయంగా వస్తుంది. అందుకోసమే ఆయన కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నారని సన్నిహితులు చెబుతున్నారు. మొత్తం మీద చింతమనేని ప్రభాకర్ మాత్రం 2014 నుంచి 2019 వరకూ ఉన్న తరహాలో ఇప్పుడు ఉండటం లేదన్నది మాత్రం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం.
Tags:    

Similar News