Andhra Pradesh : కౌంటర్లు ఒక్కటే సరిపోదు సామీ... అసలు పని చూస్తేనే.. పదవి ఉంటుందట

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన హెచ్చరికలు మంత్రులపైన బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది.

Update: 2025-07-17 07:00 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల చేసిన హెచ్చరికలు మంత్రులపైన బాగానే పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది. మంత్రులు యాక్టివ్ అయ్యారు. ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులు యాక్టివ్ గా లేకపోతే కొత్త వారు వస్తారని చేసిన హెచ్చరికలతో అమాత్యులు పరుగులు పెడుతున్నారు. మొన్నటి వరకూ అనావృష్టి ఇప్పుడు అతి వృష్టిలా మారిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. విపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానం చెప్పడం లేదని, కౌంటర్ ఇవ్వడానికి కూడా సమయం లేదా? అని మంత్రులను చంద్రబాబు ప్రశ్నించడంతో ఇక వేగంగా రియాక్ట్ అవుతున్నారు అమాత్యులు. చంద్రబాబు హెచ్చరికలతో తమ పదవి ఎక్కడ ఊడుతుందేమోనన్న భయం వారిని పరుగులు పెట్టిస్తుంది.

నిన్న జగన్ మీడియా సమావేశం తర్వాత...
నిన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ అలా మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వంపై విమర్శలు, హామీలు అమలు చేయలేదని, అధికారులకు, చంద్రబాబు వార్నింగ్ లు ఇస్తూ చేయడంపై వెనువెంటనే మంత్రులు రియాక్ట్ అయ్యారు. పోటీ పడి మరీ మీడియా సమావేశాలు పెట్టి జగన్ ను ఒక ఆటాడుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు మంత్రులు ఎక్కడ పర్యటనలో ఉన్నప్పటికీ కొందరు హడావిడిగా అమరావతికి వచ్చి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశాలు పెడితే మరికొందరు తమ జిల్లా కేంద్రం నుంచి మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగన్ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకోసం జగన్ మీడియా సమావేశాన్ని మొత్తం చూసి అందులో ప్రభుత్వంపైనా, చంద్రబాబుపైన చేసిన విమర్శలను ఖండించార.
ఇప్పటికే ఇక నిర్ణయానికి వచ్చిన...
అయితే మంత్రుల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు వారికి ఉద్వాసన తప్పదని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో అత్యధిక మంది గెలవడంతో అందరికీ అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, అందులో భాగంగా ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరుపుతారని అంటున్నారు. అయితే అది ఎప్పుడనేది ఇప్పుడు చెప్పలేకపోయినా రెండేళ్లు కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేస్తారా? లేదా ముందుగానే చేపడతారా? అన్నది మాత్రం తెలియక అమాత్యులు ఆందోళనలోనే ఉన్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబు రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. మర్యాదపూర్వకంగానే గవర్నర్ ను కలిసినా విస్తరణకు సంబంధించి అన్న అనుమానంతో మంత్రులు ఒకింత ఆందోళనకు గురయ్యారని తెలిసింది.
కౌంటర్ ఇచ్చినంత మాత్రాన...
కేవలం ప్రతిపక్ష పార్టీ విమర్శలకు మాత్రమే కౌంటర్ ఇచ్చి ఊరుకుంటే సరిపోదంటున్నారు. మంత్రుల బాధ్యతలు చాలా ఉన్నాయి. శాఖలపై పట్టు సంపాదించుకోవడంతో పాటు నిరంతరం ప్రజల్లో తిరుగుతూ తమ శాఖకు సంబంధించిన నిధులు ఏమేం ఖర్చు పెట్టారు? ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏడాది కాలంలో చేసిన మంచిపనులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను కూడా వివరించాలి. దీనికి తోడు ముఖ్యమైనది కార్యర్తలను కలుపుకుని పోవడంతో పాటు తమకు కేటాయించిన జిల్లాల్లో కూటమి పార్టీలు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలను పరిష్కరించడంలో విఫలమవ్వడాన్ని కూడా చంద్రబాబు పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయంటున్నారు. అందుకే మంత్రులు కేవలం కౌంటర్లు మాత్రమే కాదు...కాంట్రావర్సీ లు లేకుండా చేయడంలో కూడా సత్తా చూపాల్సి ఉంటుందట.


Tags:    

Similar News