Chandrababu : తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదేమోనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈసారి మాత్రం ఆయనకు అనుభవం కన్నా అడ్డంకులే ఆటంకాలుగా మారే అవకాశాలున్నాయి. నిధుల కొరతతో పాటు సంక్షేమాన్ని అమలు చేయడం కత్తిమీద సాముగా మారింది. ప్రతిపక్షం నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టాలన్న ప్రయత్నంలో ఆయన ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పేశారు. మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ పధకం కింద.. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని ప్రతిపక్ష వైసీపీ పదే పదే గుర్తు చేస్తుంది.
ఆస్తులు అమ్మాల్సిందేనా?
ఈ రెండు పథకాలు అమలు చేయాలంటే అంత సులువు కాదు. ఆడబిడ్డ పథకం అమలు చేయాలంటే ప్రభుత్వానికి చెందిన ఆస్తులు అమ్మాల్సిందేనని అచ్చెన్నాయుడు గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. అర్హులు ఎందరు? ఎవరికి ఇస్తారన్న దానిపై పథకం క్లిక్ అయ్యేది ఆధారపడి ఉంటుంది. ఏదో కొందరికి ఇచ్చామని మమ అనిపించడానికి వీలులేదు. మహిళల్లో ఒకరికి వచ్చి పది మందికి పథకం రాకపోతే ఇరవై మంది వ్యతిరేకమవుతారు. నిరుద్యోగ భృతి కూడా అంతే. అది అమలుకు సాధ్యమయ్యే హామీ కాదు. నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలంటే ఖజానా సరిపోదు. అందుకే చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా...
గతంలో సంక్షేమంపై చంద్రబాబు ఎన్నడూ ఇలా టెన్షన్ పడలేదు. ఆయన దృష్టంతా అభివృద్ధిపైనే ఉంది. గత ప్రభుత్వం అప్పులు చేసిందని, విధ్వంసం నుంచి బయటపడేస్తున్నామని చెప్పాలనుకున్నా కుదిరే పని కాదు. ఎందుకంటే ఇప్పటికే రెండేళ్ల సమయం పూర్తయింది. ప్రస్తుతం గ్రౌండ్ చేసిన హామీలను అమలు చేయడానికే అప్పులు చేయాల్సి వస్తుంది. ప్రతి నెల అప్పుల కోసం ఢిల్లీ వైపు చూడాల్సి వస్తుంది. మరొకవైపు రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం వంటివి కూడా సవాలుగా మారుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఈ రెండు పథకాలను అమలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి తలకిందులు తపస్సు చేసినా సాధ్యం కాదన్నది ప్రతిపక్షం ఆలోచన. అందుకే ఆరెండింటిపైనే ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. మరి చంద్రబాబు ఈ రెండు పథకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.