Chandrababu : చంద్రబాబు భలే చెప్తారు... జరిగే పనేనా బాసూ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు వింటుంటే అతిశయోక్తి అనిపించక మానదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న మాటలు వింటుంటే అతిశయోక్తి అనిపించక మానదు. నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో జిల్లాలోని ఏడుగురు ఎమ్మెల్యేలను ఇన్ ఛార్జి మంత్రులు సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారట. అంతేకాదు.. ఇటీవల వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు కూటమిలోని మిత్ర పక్షాలకు ఇబ్బందికరంగా మారాయి. జీరో అవర్ లో కొందరు... ప్రశ్నోత్తరాల సమయంలో మరికొందరు కూటమిలోని ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు వార్నింగ్ లను కూడా పట్టించుకోని ఎమ్మెల్యేలు..ఇన్ ఛార్జిమంత్రుల మాటలను చెవికెక్కించుకుంటారా? అన్నది సందేహమేనని పార్టీ నేతలే అంటున్నారు.
సీనియర్ నేతలే లైన్ తప్పుతుంటే?
గతంలో పరిస్థితి ఇప్పుడు రాజకీయాల్లో లేదు. నియోజకవర్గంలో తామే కింగ్. తాము చెప్పినట్లే జరగాలి. ఏమాత్రం తేడా వచ్చినా పార్టీ అన్నది చూసుకోరు. తమకు రావాల్సిన ప్రయోజనాలు దక్కకుంటే ఏ ప్లాట్ ఫారంలోనైనా వారు నిలదీసే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది కేవలం అధికార పార్టీలోనే కాదు. ప్రతిపక్ష పార్టీలోనూ అలాగే ఉంది. అందుకే ఇప్పటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడం మంత్రుల వల్ల కాదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీనియర్ ఎమ్మెల్యేలు బొండా ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నందమూరి బాలకృష్ణ వంటి నేతలు మాత్రమే కొంత వివాదానికి కారణమయ్యారు. వీరిని కట్టడి చేయడానికి మంత్రుల వల్ల అవుతుందా? అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
అందరూ కొత్త వారే కావడంతో...
ప్రస్తుతం మంత్రివర్గంలో దాదాపు 90 శాతం కొత్తవారున్నారు. అందులోనూ తొలిసారి ఎన్నికయిన వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈ కుర్ర మంత్రులను అనుభవం ఉన్న సీనియర్ నేతలు లెక్కపెడతారా? వారితో సమన్వయం చేసుకోవడానికి ప్రయత్నించినా సహకరిస్తారా? అన్న చర్చ పార్టీలో జరుగుతుంది. మంత్రులను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు టీడీఎల్పీసమావేశం ఒకసారి పెట్టి గట్టిగా వార్నింగ్ ఇస్తే సరిపోతుందని, అంతేకాని ఎమ్మెల్యేలను కట్టడి చేసే బాధ్యత మంత్రులపైకి నెడితే మరొకసారి ఇబ్బందులు తలెత్తవన్న గ్యారంటీ ఏంటన్న ప్రశ్న సూటిగానే వినిపిస్తుంది. అందుకే ఎమ్మెల్యేలను కట్టడి చేయాలంటే లోకేశ్, చంద్రబాబు వల్లనే అవుతుందని, మంత్రుల వల్ల అయ్యే పనికాదని చాలా మంది తేల్చేశారు. మరి ఏం చేస్తారో చూడాలి.