Chandrababu : విపత్తు ను ఎదుర్కొన్నారు సరే.. పార్టీకి నష్టం జరుగుతున్నా పట్టించుకోరా?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని నానుస్తూ ఉంటారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతి అంశాన్ని నానుస్తూ ఉంటారు. కాలం సమస్యను పరిష్కరిస్తుందని భావిస్తారు. అయితే పిడుగు కూడా అదే మంత్రం పనిచేయదు. టెక్నాలజీలో తనకు తిరుగులేదని నిరూపించుకుంటున్న చంద్రబాబు, విపత్తు సమయంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడి నష్టాన్ని నివారించే చంద్రబాబు.. పార్టీకి నష్టం జరుగుతున్నా నానుస్తూ వెళుతుండటం, చర్యలకు దిగకపోవడంపై పార్టీలో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది. అందుకే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇష్టమొచ్చిన తరహాలో వ్యవహరిస్తున్నారని, గతంలో కంటే ఇప్పుడు టీడీపీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా కనిపిస్తుందని అంటున్న కామెంట్స్ కూడా టీడీపీ సోషల్ మీడియాలోనే కనిపిస్తున్నాయి.
భారీగా నష్టం జరిగినా...
తిరువూరు పంచాయతీ విషయంలోనూ అదే జరుగుతుందా? అన్న అనుమానం అందరిలోనూ కలుగుతుంది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య జరిగిన వివాదం సాధారణమైన విషయం కాదు. ఇద్దరూ రోడ్డెక్కి ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు చేసుకున్నారు. అవి పైకి వ్యక్తిగత విమర్శలుగానే కనిపిస్తున్నప్పటికీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా డ్యామేజీ చేశాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కౌన్సిలర్లకు డబ్బులు పెద్దయెత్తున ఇవ్వడం, ఇసుక, మద్యం వంటి విషయాలు స్వయానా ఒక టీడీపీ ఎమ్మెల్యే బయటపెట్టడంతో పార్టీకి నష్టం చేకూర్చే అంశాలే. ఎన్నికల్లో టిక్కెట్ల కోసం కోట్ల రూపాయలు చెల్లించామని కొలికపూడి ఆరోపణలతో టీడీపీకి భారీ నష్టం చేకూర్చింది.
చంద్రబాబు బిజీగా...
అయితే దీనిపై టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తాను ఇద్దరినీ పిలిచి మాట్లాడాలనుకున్నప్పటికీ నాడు యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రాబాబు దానిని వారించారు. తాను వచ్చి ఆ సమస్యపై దృష్టి పెడతానని చెప్పారు. అయితే యూఏఈ నుంచి చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే మొంథా తుపాను వచ్చింది. ఇక తుపాను సమయంలో చంద్రబాబు బిజీగా ఉన్నారు. ఇక అది పూర్తయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తిరువూరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. అలాగే వచ్చే నెల 2వ తేదీన చంద్రబాబు లండన్ పర్యటనకు బయలుదేరి వెళుతున్నారు. తిరిగి నవంబరు 6వ తేదీన కాని తిరిగి రారు. ఈ పరిస్థితుల్లో తిరువూరు సమస్యపై నేడు పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు నేతలతో చర్చించనున్నారు. మరి ఈరోజు నిర్ణయం ప్రకటిస్తారా? లేక మరేదైనా ఆదేశాలు జారీ చేసి విదేశీ పర్యటనకు వెళతారా? అన్నది తెలియాల్సి ఉంది.