Chandrababu : చంద్రబాబు కష్టానికి ఫలితం ఉంటుందా? కార్యకర్తల ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు.

Update: 2025-11-07 07:26 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిపైనే ఫోకస్ పెట్టారు. విడిపోయి నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఏడు పదులు దాటిన వయసులోనూ చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎవరూ కాదనలేరు. పెట్టుబడుల కోసం ఒక ముఖ్యమంత్రి కాలికి బలపం కట్టుకుని విదేశాల చుట్టూ తిరగడం ఒక్క చంద్రబాబు విషయంలోనే చూస్తున్నాం. ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తనకంటూ రాజకీయాల్లో ఒక మార్క్ ను క్రియేట్ చేసుకోవాలని పడుతున్న తపన స్పష్టంగా కనపడుతుంది. అందుకే వయసును, అలసటను లెక్క చేయకుండా ఆయన పనిచేస్తున్నారు. అయితే కార్యకర్తలు మాత్రం చంద్రబాబు పనితీరుపై కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన పొరపాట్లను కూడా గుర్తించడం లేదని కార్యకర్తలే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం అభివృద్ధి సంక్షేమం తమను మరొకసారి అధికారంలోకి తెస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు ఉన్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు మాత్రం అందుకు విరుద్ధంగా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పోస్టు చేస్తుండటం పార్టీలో చర్చనీయాంశమైంది. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సైబరాబాద్ ను అభివృద్ధిని చేసినప్పటికీ 2004 ఎన్నికల్లో దాని చుట్టు పక్కల పరిధిలో ఉన్న యాభై శాసనసభ నియోజకవర్గాల్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గం మినహా మరే చోట టీడీపీ గెలవలేకపోవడాన్ని ఈ సందర్భంగా కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
2014 ఎన్నికల్లో...
2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మరోసారి అమరావతితో పాటు అనంతపురంలో కియా పరిశ్రమను తెచ్చారని, కానీ అమరావతి చుట్టు పక్కలతో పాటు, అనంతపురంలో కియా పరిశ్రమను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ పార్టీ పూర్తిగా 2019 ఎన్నికల్లో చతికలపడటానానికి గల కారణాలను కూడా గుర్తుంచుకోవాలని మరికొందరు కోరుతున్నారు. గతంలో కంటే ఈసారి కాస్త భిన్నంగా చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమపాళ్లలో తీసుకెళుతున్నా వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా ఉంటాయన్న గ్యారంటీ ఉందా? అని కొందరు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవంలోకి వచ్చి కార్యకర్తల సంక్షేమాన్ని కూడా పట్టించుకోవాలని కోరుతున్నారు.


Tags:    

Similar News