ఎటూ తేలని పంచాయతీ.. సమావేశం లో ఎవరి వాదనలు వారివే
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి సమావేశం ముగిసింది
ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి సమావేశం ముగిసింది. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వర్యంలో దాదాపు గంటన్నర సేపు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సమావేశంలో రెండు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో బనకచర్ల ప్రాజెక్టును ఏకైక అజెండాగా ఏపీ ప్రభుత్వం పెట్టింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం పదమూడు అంశాలతో అజెండాను ప్రవేశపెట్టింది. ఈ సమావేశంలో ఎవరి వాదనలను వారు వినిపించినట్లు తెలిసింది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
చంద్రబాబు వాదనలో...
గోదావరి నుంచి ప్రతి ఏటా వందల సంఖ్యలో టీఎంసీల వరద జలాలు సముద్రంలో కలసి పోతున్నాయని, వృధాగా పోయే నీటిని మాత్రమే తాము వినియోగించుకునేలా ప్రాజెక్టును డిజైన్ చేశామని, పెన్నా నదికి గోదావరి వరదనీటి జలాలను తరలించి అక్కడి నుంచి వెనకబడిన రాయలసీమకు తరలించేందుకు మాత్రమే ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశంలో చెప్పినట్లు సమాచారం. తాము గతంలో తెలంగాణ అనేక ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నా అడ్డు చెప్పలేదని, రెండు తెలుగు రాష్ట్రాలు నీటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలన్నదే తమ ఉద్దేశ్యమని, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందడమే తమ ఆలోచన అని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. బనకచర్లకు అన్ని అనుమతులు వచ్చేలా చూడాలని, ఇది ఏపీలోని రాయలసీమ రైతాంగానికి గేమ్ ఛేంజర్ అని కూడా చెప్పినట్లు తెలిసింది.
రేవంత్ అభ్యంతరంతో...
అయితే ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పినట్లు చెబుతున్నారు. గోదావరి నదిలో నికర జలాలతో పాటు వృధా జలాల వాటాను తేల్చాలని కోరినట్లు తెలిసింది. ముందుగా తాము ఇప్పటికే కృష్ణా, గోదావరి నదిపై నిర్మించతలపెట్టిన అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు రాలేదని, ముందుగా వాటికి అనుమతులు ఇచ్చిన తర్వాత తాము ప్రాజెక్టులు నిర్మించిన తర్వాత మాత్రమే బనకచర్లకు అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్పష్టంగా సమావేశంలో చెప్పినట్లు తెలిసింది. తెలంగాణకు దక్కాల్సిన చుక్కనీటిని కూడా తాము వదులుకోబోమని ఆయన సమావేశంలోనే వ్యక్తం చేసినట్లు తెలిసింది. ట్రైబ్యునల్, చట్టాలను ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. దీంతో కేంద్ర జలశక్తి శాఖ తాము అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంటామని, అవసరమైతే మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. గంటన్నర సేపు సాగిన ఈ సమావేశంలో ఎటూ తేలకుండానే ముగిసిందంటున్నారు.