Pulivendula Zptc by Election : నాడు కుప్పం.. నేడు పులివెందుల.. సేమ్ టు సేమ్.. సీన్

పులివెందుల నియోజకవర్గంలో జరగుతున్న ఉప ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ పోరు సాగుతుంది

Update: 2025-08-12 04:54 GMT

పులివెందుల నియోజకవర్గంలో జరగుతున్న ఉప ఎన్నికలు శాసనసభ ఎన్నికలను తలపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా హోరాహోరీ పోరు సాగుతుంది. ఉద్రిక్తతల మధ్య నేడు పోలింగ్ ప్రారంభమయింది. వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఈ ఉప ఎన్నిక ఎమ్మెల్యే ఎన్నికను తలపిస్తుందంటే ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఉదయం నుంచి వస్తున్న వార్తలు చూస్తుంటే ఒక జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం ఇంత పంతం అవసరమా? అని ఎవరికైనా అనిపించక మానదు. ఎందుకంటే ఘర్షణలు, ఉద్రిక్తతలు, పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగడం, రిగ్గింగ్ వంటి ఆరోపణలు కూడా ఈ ఉప ఎన్నికల్లో వినిపిస్తున్నాయంటే ఎంత విచిత్రమో అర్థం చేసుకోవచ్చు.

నాడు కుప్పం...
నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జడ్పీటీసీ ఎన్నికలో విజయం సాధించేందుకు ఆ పార్టీ అనుసరించిన విధానాలనే నేడు టీడీపీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనుసరిస్తుందడనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే ఈ ఉప ఎన్నిక ఫలితంతో రెండు పార్టీలకు ఒరిగేదేమీ లేదు. ఒకటి రెండు జడ్పీటీసీలు గెలిచినా జడ్పీపీఠం అధికార పార్టీ దరి చేరదు. అలాగే వైసీపీకి ఈ రెండు జడ్పీటీసీలు ఓడిపోయినా ఏ మాత్రం నష్టం జరగదు. కానీ వైసీపీ అధినేత సొంత నియోజకవర్గం కావడంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది.
మూడు దశాబ్దాల నుంచి...
గత మూడు దశాబ్దాల నుంచి పులివెందులలో జడ్పీటీసీ ఎన్నిక జరగలేదు. నోటిఫికేషన్ విడుదలయిన నాటి నుంచి పులివెందుల నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు రెండు జడ్పీటీసీ ఎన్నికలకు ఇన్ ఛార్జులుగా నియమించారు. అలాగే వైసీపీ సీనియర్ నేతలందరూ అక్కడే మొహరించారు. అనేక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ఏజెంట్లను బయటకు లాగే ప్రయత్నం కూడా జరిగింది. పోలీసులకు ఈ ఉప ఎన్నికలు తలనొప్పిగా మారాయి. రిగ్గింగ్ చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతుందని టీడీపీ నేతలు అంటున్నారు. కామేపల్లి, యర్రబల్లెలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఓటర్లు వస్తున్నా...
ఓటర్లు మాత్రం ఏ మాత్రం భయం లేకుండా ఓటింగ్ లో పాల్గొనేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. అయితే కొన్ని చోట్ల మాత్రం తమను లోపలికి అనుమతించడం లేదని ఓటర్లు చెబుతున్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్న వాహనంపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు చెబుతున్నారు. తమను ఓటు వేయకుండా పోలీసులే అడ్డుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. స్థానికేతరులు కూడా వచ్చి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సంచరిస్తూ కొంత టెన్షన్ ను సృష్టిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ పోలింగ్ కేంద్రంలోని టీడీపీ, వైసీపీ ఏజెంట్ల మధ్య ఘర్షణలు అనేక చోట్ల తలెత్తాయి. ఇటు ఒంటిమిట్టలోనూ అదే పరిస్థితి కొనసాగుతుంది.







Tags:    

Similar News