Btech Ravi :ఇకపై బీటెక్ రవి మాత్రమే కాదట.. త్వరలో కీలక అనౌన్స్ మెంట్?
పులివెందుల నియోజకవర్గానికి చెందిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి త్వరలోనే కీలక పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి
పులివెందుల నియోజకవర్గానికి చెందిన మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవికి త్వరలోనే కీలక పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీటెక్ రవిగా పేరున్న ఈయన తెలుగుదేశం పార్టీ కీలక నేతగా ఉన్నారు. 2017 లోజరిగిన శాసనమండలి ఎన్నికల్లో నాడు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తొలి నుంచి జగన్ కు, వైసీపీతో పాటు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన బీటెక్ రవికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సత్సంబంధాలున్నాయి. పార్టీ కోసం పులివెందుల వంటి నియోజకవర్గంలో గట్టిగా నిలబడిన నేతగా బీటెక్ రవిని పార్టీ నాయకత్వం గుర్తించింది. అందుకే ఆయనకు త్వరలో కీలక పదవి దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
టీడీపీలో కీలక నేతగా...
తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి రాజీయాల్లో వచ్చారు. 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.ప్రస్తుతం పులివెందుల టీడీపీ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ అధికారంలో లేని సమయంలో నాడు శాసనమండలిలో వైసీపీ నేతలు నారా లోకేశ్ ప్రసంగానికి అడ్డుపడే సమయంలో బీటెక్ రవి వారిని అడ్డుకుని లోకేశ్ కు మరింత దగ్గరయ్యారంటారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో తన భార్యను పోటీ చేయించి గెలిపించుకున్నారు. జగన్ ఇలాకాలో తొలిసారి ఓటమిని ఆయనకు రుచిచూపించిన బీటెక్ రవి నాయకత్వం ఇచ్చే కీలక పదవులు జాబితాలో ఇప్పుడు టాప్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు.
కేబినెట్ లో చోటు...?
బీటెక్ రవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేయాలన్న ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. కడప జిల్లాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో నేత రాయచోటికి చెందిన మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. అయితే పులివెందుల నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఇబ్బంది పెట్టాలంటే బీటెక్ రవికి మంత్రి పదవి ఇచ్చి నియోజకవర్గంలో గ్రిప్ పెంచేలా నాయకత్వం ఆలోచన చేస్తుందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. త్వరలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో రాయలసీమ కోటాలో బీటెక్ రవిని ఎమ్మెల్సీ చేయడమే కాకుండా, మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా అందులో కడప జిల్లా నుంచి బీటెక్ రవి పేరు ఫస్ట్ లిస్ట్ లో ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.