BJP : ఎక్కడ ఒంటరిగా బలంగా ఉన్నారో చెబితే.. విజయం సాధించినట్లే

గత కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీకి ఏపీలో పట్టు లేదు.

Update: 2025-11-29 09:13 GMT

దేశంలో బీజేపీకి బలమైన నాయకత్వం ఉంది. మోదీ, అమిత్ షా వంటి వారు ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహాలను రచించుకుంటూ పార్టీని అన్ని రాష్ట్రాల్లో గెలుపు దిశగా తీసుకెళుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం మోదీ, అమిత్ షా చేతుల్లో లేదని వారికీ అర్థమయింది. ఇక్కడ రాష్ట్ర స్థాయి నేతలు ఎవరూ పెద్దగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నించరు. గత కొన్ని దశాబ్దాల నుంచి బీజేపీకి ఏపీలో పట్టు లేదు. ఒంటరిగా పోటీ చేస్తే సింగిల్ డిజిట్ ఓటింగ్ శాతానికి మాత్రమే పరిమితమవుతుంది. అందుకే టీడీపీ, జనసేన అండతోనే పార్లమెంటు స్థానాలయినా, అసెంబ్లీ సీట్లయినా గెలిచింది. బీజేపీ నేతలు తమ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.

బలపడిందా? అంటే...
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ, విభజన తర్వాత కానీ బీజేపీ ఏపీలో ఏదైనా బలపడిందా? అంటే లేదనే సమాధానమే వస్తుంది. పోనీ నాయకత్వం సరైనది లేదా? అంటే ఎందుకు లేరు.. ముప్పవరపు వెంకయ్య నాయుడు నుంచి కంభపాటి హరిబాబు, సోము వీర్రాజు, పురంద్రీశ్వరి.. నేడు మాధవ్ ఇలా రాజకీయాల్లో పట్టున్న వారే. కొంత జనాకర్షణ కలిగిన నేతలే. సామాజికవర్గం అండగా ఉన్న లీడర్లే. కానీ ఏ నియోజకవర్గంలోనూ ఒంటరిగా గెలిచేటంతగా పార్టీని తీసుకెళ్లలేకపోవడానికి కారణాలపై ఇంత వరకూ కమలం పార్టీలో అంతర్మధనం జరగలేదు. పొరుగున ఉన్న తెలంగాణలో ఒంటరిగా బీజేపీ బలపడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంత వరకూ ఒక్క పర్సెంట్ కూడా ఎదగలేదన్నది యదార్థం.
కేంద్ర నాయకత్వం సీరియస్...
దీనిపై కేంద్ర నాయకత్వం కూడా ఒకింత సీరియస్ గానే ఉందని తెలిసింది. కేంద్ర మంత్రి పదవులు, రాష్ట్రంలో మంత్రి పదవులు, గవర్నర్ గిరీ కట్టపెట్టినా ఏ మాత్రం ఫలితం ఎందుకు ఉండలేదని జాతీయ స్థాయి నాయకత్వంలో చర్చ ప్రారంభమయినట్లు తెలిసింది. ఎప్పటికీ ఇతరులపై ఆధారపడి ఎన్నేళ్లు రాజకీయాలు చేయాలన్న అసహనం కూడా అగ్రనాయకత్వం వ్యక్తం చేస్తున్నట్లు కనపడుతుంది. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం ఏపీని తమ జాబితా నుంచి తొలగించినట్లేనని భావిస్తుంది. అలాగని పార్టీని పూర్తిగా వదిలేయడం మంచిది కాదని, త్వరలోనే కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకులను పిలిచి క్లాస్ పీకే అవకాశాలు కూడా లేకపోలేదన్నది హస్తిన వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. మరి ఇప్పటికైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో కదలిక వస్తుందా? లేదా? అన్నది చూడాలి.


Tags:    

Similar News