Somu Verraju : వీర్రాజుకు ఛాన్స్ వచ్చిందంటే...అదే కారణమా?
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది
ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక స్థానంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ అధినాయకత్వం సోము వీర్రాజును ప్రకటించింది. సోము వీర్రాజు పేరును ప్రకటిస్తుందని కూటమిలోని మిత్రపక్షాలు ఊహించలేదు. అయితే అధినాయకత్వం మాత్రం చివరకు సోము వీర్రాజును అభ్యర్థిగా ప్రకటించి.. తమ్ముడు.. తమ్ముడే.. పేకాట... పేకాట అన్నట్లుగా నిర్ణయం తీసుకున్నట్లయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. సోము వీర్రాజు సీనియర్ నేత కావచ్చు. గతంలోనూ ఆయనకు ఎమ్మెల్సీ అవకాశాన్ని పార్టీ నాయకత్వం ఇచ్చింది. అయితే 2019 నుంచి 2024 వరకూ జరిగిన పరిణామాలతో సోము వీర్రాజుకు ఈసారి పదవి దక్కడం కష్టమని అందరూ అంచనా వేశారు.
టీడీపీపై విమర్శలు...
ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోము వీర్రాజు టీడీపీపై విమర్శలు చేయడంతో పాటు చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకుని అనేక సార్లు మీడియా సమావేశాలు పెట్టి మరీ ఆయన వ్యవహారశైలిని ఎండగట్టారన్న ఆగ్రహంలో టీడీపీ నేతలున్నారు. దీంతో పాటు ఏపీలో 2024 ఎన్నిలకుముందు కూటమి ఏర్పాటుకు కూడా సోము వీర్రాజు అడ్డంకులు ఏర్పరచారన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో ఉంది. సోము వీర్రాజును పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆయన స్థానంలో పురంద్రీశ్వరికి బాధ్యతలను అప్పగించడంతోనే కూటమి ఏర్పడిందన్న నమ్మకం కూడా పసుపు పార్టీ నేతలలో ఉంది. నేటికి సోము వీర్రాజును టీడీపీ కార్యకర్తలు తమకు వ్యతిరేకంగానే భావిస్తారు.
ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న...
అయితే సోము వీర్రాజు పార్టీనే నమ్ముకున్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ భావాజాలంతో బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి ఆయన కృషి చేశాడన్నది అధినాయకత్వం అభిప్రాయం. అదే సమయంలో ఎన్ని కష్టాలొచ్చినా పార్టీని నమ్ముకుని ఉన్నారంటారు. మొన్న కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన సమయంలోనూ తనకు అత్యంత సన్నిహితుడైన శ్రీనివాస వర్మకు మంత్రి పదవి ఇప్పించుకోవడంలో కూడా సోము సక్సెస్ అయ్యారు. పురంద్రీశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా శ్రీనివాసవర్మకు ఆ ఛాన్స్ వచ్చిందంటే అందుకు కారణం సోము వీర్రాజు అని చెప్పకతప్పదు. మరొక వైపు నరసాపురం ఎంపీ టిక్కెట్ రఘురామ కృష్ణరాజుకు దక్కకుండా చేయడంలో సోము వీర్రాజు హస్తం ఉందన్న విమర్శలు కూడా అప్పట్లో బలంగా వినిపించాయి.
వైసీపీకి బీ టీంగా...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సోము వీర్రాజు తన బ్యాచ్ ను తయారు చేసుకుని వైసీపీకి బీ టీం వ్యవహరించారంటూ టీడీపీ నేతలు గతంలో బహిరంగంగానే ఆరోపించారు. సోము వీర్రాజు బ్యాచ్ కు, టీడీపీ అగ్రనేతలకు మధ్య కూడా సరైన సంబంధాలు లేవు. దీంతో ఆయనకు ఈ సీటు దక్కదని అందరూ భావించారు. విశాఖకు చెందిన మాధవ్ పేరు బాగా వినిపించింది. కానీ చివరకు బీజేపీ కేంద్ర నాయకత్వం ఉదయం సోము వీర్రాజు పేరును ప్రకటించడంతో ఆయనకు ప్రయారిటీ పార్టీలో తగ్గలేదన్నది స్పష్టమవుతుంది. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరని, కేంద్రంలో టీడీపీ మద్దతుతోనే బీజేపీ సర్కార్ నడుస్తున్నందున ఇప్పుడు ఆయన స్టయిల్ ఆఫ్ యాక్షన్ కూడా మారే అవకాశంఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద టీడీపీ నేతల అభిప్రాయానికి విరుద్ధంగా ఈ ఎంపిక జరిగిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తున్నాయి.