Weather Report : వడగళ్ల వానలు.. మరొకవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో వాతావరణం వేడెక్కింది
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలోనూ వానలు పడతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, కేరళలో భారీ వర్షాలు పడతాయని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మోస్తరు వానలు పడే అవకాశముందని పేర్కొంది. అయితే ఈ వానలు పడిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కే అవకాశముంది. గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి అవి మరింత పెరిగే అవకాశముందని, ప్రజలు పగటి వేళ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ప్రస్తుతం రాత్రి, తెల్లవారు జామున మాత్రం కొంత చలివాతావరణం ఉంది.
వానలు నేటి నుంచి...
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముండటంతో నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రధానంగా రాయలసీమలో నేటి నుంచి వానలు పడే అవకాశముందని, రేపటి నుంచి దక్షిణ తీర ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఉక్కపోత వాతావరణం నెలకొంది. గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి పూర్తిగా కనుమరుగైంది. పగటి సమయాల్లో వేడి గాలులు వీస్తుండటంతో ప్రజలు భయపడుతున్నారు. రానున్న కాలంలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయనుకుంటున్న సమయంలో వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వడగండ్ల వానలు...
రాష్ట్రంలో మూడ్రోజులపాటు పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ ఒక ప్రకటనలో హెచ్చరించింది. మారిన వాతావరణ పరిస్థితు ల కారణంగా ఈ నెల 21 నుంచి 24 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.22న ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లా ల్లో తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఉరుములు, మెరుపులతో గాలివానలు బీభత్సం సృష్టించే అవకాశాలున్నట్టు తెలిపింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశము న్నదని, నెలాఖరు వరకు వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలను గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.