AP Politics : మీరు ఒకటంటే.. మేము నాలుగు అంటాం.. ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది

Update: 2025-09-26 08:08 GMT

నువ్వు ఒక మాటంటే.. నేను నాలుగంటా.. అన్నట్లుంది నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. అనడం ఎందుకు...? అనిపించుకోవడం ఎందుకు? అన్న సామెత ఇప్పుడు రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా సరిపోతుంది. 2019 నుంచి ఇటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో ఊపందుకున్నాయి. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్, నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ లపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. అప్పుడు అధికారంలో ఉండబట్టి నడిచింది.. ఇప్పుడు అదే అధికారం కోల్పోయిన తర్వాత అదే పరిస్థితి వైసీపీ నేతలకు మాత్రమే కాదు పార్టీ అధినేత జగన్ కు కూడా ఎదురవుతుంది.

పులివెందుల ఎమ్మెల్యే అంటూ...
2024 లో వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచి వైఎస్ జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అని మంత్రుల నుంచి అందరూ సంబోధిస్తున్నారు. తొలిసారి మంత్రి అయిన వాళ్లు.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు కూడా జగన్ ను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా పులివెందుల ఎమ్మెల్యే అనే మాట్లాడుతున్నారు. ఇది వైసీపీ నేతలకు కాలుతున్నట్లుంది. ఇప్పటి వరకూ భరాయిస్తూ వచ్చిన వైసీపీ నేతలు ఇక తాము కూడా ఊరుకోబోమని శాసనమండలిలో గట్టిగా చెప్పకనే చెప్పారు. ఇకపై తాము కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును పులివెందుల ఎమ్మెల్యే అని, మంత్రులయినా వారి నియోజకవర్గం పేర్లు పెట్టి పిలుస్తామని గట్టిగా చెబుతున్నారు.
కుప్పం ఎమ్మెల్యేగా...
పవన్ కల్యాణ్ ను పిఠాపురం ఎమ్మెల్యే అని, లోకేశ్ ను మంగళగిరి ఎమ్మెల్యే అనే తాము ఇక పిలుస్తామని వారు నేరుగా చెబుతున్నారు. నిన్న శాసనమండలిలో రమేష్ యాదవ్ చంద్రబాబును ఉద్దేశించి కుప్పం ఎమ్మెల్యే అని అనడంతో అధికార పార్టీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. దీనిపై అభ్యంతరాలు తెలిపారు. అయితే దీనికి సీనియర్ నేత బొత్స కూడా తమ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినా పులివెందుల ఎమ్మెల్యే అని ఎందుకు అంటుున్నారని ఎదురుదాడికి దిగారు. మొత్తం మీద జగన్ ను పులివెందుల ఎమ్మెల్యే అంటే.. తాము కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తామని తెగేసి చెప్పారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలి. అలాగే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఒకసారి గెలిచిన వారు సయితం పులివెందుల ఎమ్మెల్యే అనడం అర్ధరహితమని, అవహేళన చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా ఏపీ రాజకీయ నేతలు హుందాగా రాజకీయం చేస్తే మంచిదని అంటున్నారు.


Tags:    

Similar News