Andhra Pradesh : కూటమిలోని మిత్రపక్షాలకు కల్తీ మద్యం పట్టలేదా?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది.

Update: 2025-10-11 07:15 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది. విపక్ష వైసీపీ చేసే విమర్శలకు కూటమిలోని మిత్ర పక్షాలు అండగా ఉండటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సోషల్ మీడియాలో కూడా విమర్శలు జోరుగా కనిపిస్తున్నా కూటమి పార్టీల్లో కదలికలు లేకపోవడంపై పార్టీ నేతలు కొంత క్యాడర్ లో అయోమయం నెలకొంది. అసలు అగ్రనేతల మధ్య ఉన్న సఖ్యత కిందిస్థాయిలో కనిపించడం లేదన్న అభిప్రాయం మూడు పార్టీల నేతల్లో వ్యక్తమవుతుంది. కూటమి ధర్మం ప్రకారం ప్రభుత్వంపై విమర్శలు వచ్చినప్పుడు మూడు పార్టీలు స్పందించాల్సి ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం సైలెన్స్ ఎక్కువగా రాజ్యమేలుతుండటం హాట్ టాపిక్ గా మారింది.

ములకలచెరువు నకిలీ మద్యం కేసు...
తంబళ్లపల్లి ములకలచెరువు నకిలీ మద్యం కేసు ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. అందులో కీలక నిందితులు టీడీపీకి చెందిన వారు కావడంతో సహజంగా విపక్ష వైసీపీ విమర్శలకు దిగుతుంది. అద్దేపల్లి జనార్థన్, జయచంద్రారెడ్డిలు టీడీపీకి చెందిన వారు కావడంతో వైసీపీ నేతలు కల్తీ మద్యం విషయంలో ఒకింత జోరు పెంచారు. కల్తీ మద్యం కేసులో ఉన్న నిందితులందరూ టీడీపీ వారేనని, ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారని, బెల్ట్ షాపుల విషయంలో చూసీచూడనట్లు ప్రభుత్వం వ్యవహరించకపోవడంతోనే కల్తీ మద్యం అక్కడకు సరఫరా చేయడానికి కల్తీరాయుళ్లకు సులువుగా మారిందని వైసీపీ నేతలు ఒక రేంజ్ లో చెలరేగిపోతున్నారు. అయితే టీడీపీ మినహా మిగిలిన పార్టీలు ఈ విషయంలో ఖండించే ప్రయత్నం చేయకపోవడం విశేషం.
అండగా నిలబడాల్సిన సమయంలో...
ముఖ్యంగా జనసేన, బీజేపీ నేతలు టీడీపీకి అండగా నిలబడే ప్రయత్నం చేయలేదన్న విమర్శలు టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. వైసీపీ చెలరేగిపోతున్న సమయంలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలిచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని మిత్ర పక్షాలను టీడీపీ సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇదేమి మిత్రధర్మమంటూ నిలదీస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలు గళం విప్పితే వైసీపీ చేసే ఆరోపణలకు విలువ ఉండదని, కూటమి మధ్య బలమైన సత్సంబంధాలున్నాయన్న సంకేతాలు వెళతాయని అంటున్నారు. మరి కల్తీ మద్యం కేసులో ఎందుకు మూగనోము పాటిస్తున్నారో చెప్పాలంటూ కొందరు బహిరంగంగానే మిత్రపక్షాలను అడుగుతున్నారు. మొత్తం మీద కల్తీ మద్యం కేసులో మిత్రపక్షాల నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారు.


Similar News