Andhra Pradesh : గుడ్ న్యూస్.. గర్భిణులకు పదకొండు వేలు.. ఉచితంగా నిత్యావర వస్తువులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇంట్లో ఉన్న చెత్తను ఇస్తే ఉచితంగా నిత్యావసర వస్తువులను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి మండలంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథం వారానికి ఒక రోజు ప్రతి గ్రామానికి వస్తుందని, అప్పుడు చెత్తను ఇచ్చి ఉచితంగా నిత్యావసర సరుకులను తీసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏ ఏ సరుకులు ఇస్తారన్న దానిపై త్వరలోనే ప్రకటన ప్రభుత్వం నుంచి విడుదల చేయనుంది. మార్చి 31 నాటికి గ్రామీణ చెత్త సేకరణ బాధ్యత ప్రభుత్వానిదేనని చంద్రబాబు తెలిపారు.
పీఎంవివై పథకం ద్వారా...
ఇక గర్భిణులకు పదకొండు వేల ఆర్థిక సాయం కేంద్ర ప్రభుత్వం నుంచి అందనుంది. ప్రధానమంత్రి మాతృవందన యోనజన పథకం ద్వారా గర్భిణులతో పాటు పాలిచ్చే తల్లులకు మొత్తం పదకొండు వేల రూపాయలు ఆర్థిక సాయం అందచేయనున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుందని చెప్పింది. మొదటి కాన్పుకు ఐదు వేల రూపాయలు, రెండో కాన్పులో పాప పుడితే ఆరు వేలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసింది. గర్భిణీ స్త్రీల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం ద్వారా మొత్తం లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పుష్టికరమైన ఆహారాన్ని తీసుకుని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ఆకాంక్షించింది.
మూడు విడతల్లో...
పదకొండు వేల రూపాయలు మొత్తం మూడు విడతల్లో జమ అవుతుంది. మొదటి కాన్నపుకు ఐదు వేల రూపాయలు ఇస్తారు. గర్భధారణ రిజిస్ట్రేషన్ తర్వాత వెయ్యి రూపాయలు, ఆరో నెల తర్వాత రెండు వేల రూపాయలు, శిశువు తొలి టీకా అనంతరం రెండు వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అలాగే రెండో కాన్పుకు అదనంగా మరో ఆరు వేల రూపాయలను అందిస్తారు. దరఖాస్తు కోసం అంగన్‌వాడీ కేంద్రంలో ఫారం నింపి ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు, గర్భధారణ రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. లేకపోతే అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయవచ్చు. పూర్తి వివరాలకు పీఎంఎంవివై పధకం వెబ్ సైట్ లో చూసుకోవచ్చని తెలిపింది.