Andhra Pradesh : రూపాయి లంచం ఇవ్వకుండా నేరుగా డబ్బులిచ్చే ప్రభుత్వం
రూపాయి లంచం లేకుండా పథకాలను అందించేది కూటమి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు
రూపాయి లంచం లేకుండా పథకాలను అందించేది కూటమి ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆటో డ్రైవర్లకు సేవలో పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరి అకౌంట్లలో పదిహేను వేల రూపాయలు డబ్బులు పడ్డాయని అన్నారు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లే చేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వమని చంద్రబాబు అన్నారు. ఆటో డ్రైవర్లకు ఎన్నో కష్టాలున్నాయని, రోడ్లు అద్వాన్నంగా ఉండేవని, సగం డబ్బులు రిపేర్లకే పోయాయని చంద్రబాబు అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగి అవస్థలు పడుతున్న సమయంలో ఎన్డీఏ కూటమి ఒక పిలుపు ఇచ్చిందని తెలిపారు. 94 శాతం స్ట్రయిక్ రేటు తో 2024 ఎన్నికల్లో విజయం సాధించామని చెప్పారు.
అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో...
అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే వ్యవస్థలన్నీ అగమ్య గోచరంగా ఉందని, పరిస్థితులు చక్కబడతాయా? అని భావించేవాడినని చంద్రబాబు అన్నారు. కానీ తన ఆలోచన అంతా ఒకటేనని, తాను చెప్పిన మాటను అమలు చేయాలని భావించి చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం చూశారా? అని మిమ్మల్ని అడుగుతున్నానని చంద్రబాబు ప్రశ్నించారు. 33 వేల కోట్ల రూపాయలు పింఛన్ల కోసం ఖర్చు పెట్టే ప్రభుత్వం ఎన్డీఏ మాత్రమేనని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ అని అన్నారు. స్త్రీ శక్తి పథకం బంపర్ హిట్ అయిందని చంద్రబాబు అన్నారు. మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారు.