Chandrababu : చంద్రబాబుపై వత్తిడి పెరుగుతుందా? భారం మోయలేరా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ నాలుగేళ్ల పాలన కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి

Update: 2025-02-03 06:05 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఈ నాలుగేళ్ల పాలన కత్తిమీద సాములాంటిదనే చెప్పాలి. రానున్న రోజులు గడ్డు రోజులేనని అనాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతుంది. మొన్నటి వరకూ సోషల్ మీడియాలోనే కనిపించిన ఈ ఆగ్రహం ఇప్పుడు చంద్రబాబు పాల్గొనే సభల్లో నిలదీసేందుకు కూడా కొందరు సిద్ధమవుతున్నారు. అయితే ఎవరో ఒకరిద్దరు చేసిన పని అని కొట్టిపారేయడానికి వీలు లేదని చంద్రబాబుకు తెలుసు. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలే కూటమి పార్టీలను అత్యధిక స్థానాలతో గెలిపించారన్నది ఆయనకు తెలియంది కాదు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే విశ్వసనీయత దెబ్బతింటుందని తెలుసు.

ఖాజానా ఖాళీగా ఉందని...
కానీ ఖజానా ఖాళీగా ఉందని ఎన్నాళ్లో నెట్టుకు రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఈ విషయం తెలియదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో గతంలో జగన్ కరోనా సమయంలోనూ రెండేళ్ల పాటు సంక్షేమ పథకాలను ఆపకుండా ఇచ్చిన విషయాన్ని వైసీపీ సోషల్ మీడియాలో పదే పదే గుర్తు చేస్తుంది. నిజమే.. కష్టం రాష్ట్రానికి. ఖజానాకు. అది తమ దాకా రాకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తమకు సహకరించాలని, 2047 విజన్ కు పాటుపడాలని చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలకు చెవికి ఎక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికైనా వారికి సొంత ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రం అభివృద్ధి అనేది వారికి అనవసరం. తమకు రావాల్సిన డబ్బు రాకుండా పోయిందనే బాధ ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
పెట్టుబడి సాయమేదీ...?
ప్రధానంగా రైతులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకూ రైతులకు పెట్టుబడి సాయం కింద ఏపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా కేటాయించలేదు. రాజధాని అమరావతిలో మాత్రం వేల కోట్లు పెట్టి భవనాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇది వారికి కాలుతుందంటున్నారు. తమను గాలికి వదిలేశారన్న అభిప్రాయం ఎక్కువ మంది రైతుల్లో వ్యక్తమవుతుంది. తుపానులు, అకాల వర్షాలతో అసలే నష్టపోతుంటే పోలవరం, రాజధాని నిర్మాణాల పేరు చెప్పి తమను నిర్లక్ష్యం చేస్తే రైతాంగం ఇక ఊరుకునేట్లు లేదు. రాయచోటి లో నిలదీసింది ఒక వ్యక్తి కావచ్చు. కానీ 90 శాతం మంది రైతుల అభిప్రాయం ఇదేనని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు. అంతెందుకు కూటమి ఎమ్మెల్యేలతో మాట్లాడినా వారు అంగీకరిస్తారు.
ప్రజల్లో అసహనం...
ఇక తల్లికి వందనం కూడా అమలు చేయకపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుంది. మహిళలు అభిప్రాయమేంటంటే జగన్ అధికారంలో ఉండి ఉంటే తమకు అమ్మఒడి డబ్బులు అందేవని. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఏడాది వాయిదా వేయడాన్ని కూడా ఎగవేత కింద జమ చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారింది. డబ్బులు లేవు. కేంద్రం ఇచ్చే నిధులు రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేటాయించాల్సి వస్తుంది. దానిని డైవర్ట్ చేయడానికి వీలవ్వదు. ఇక సంక్షేమ పథకాలకు అప్పులు చేయాలంటే మరింత భారంగా మారుతుంది. మే నెలలో ఇది మరింత భారమయ్యే అవకాశముంది. ఎందుకంటే తల్లికి వందనం, రైతు పెట్టుబడి సాయంతో పాటు మహిళలకు ఫ్రీ బస్సు వంటివి అమలు చేయాలంటే అది చంద్రబాబుకు సాధ్యమవుతుందా? కాదా? అన్న అనుమానం కూడా అనేక మందిలో కలుగుతుంది. అందుకే జనం అడుగుతున్నారు. ప్రశ్నిస్తే పోయేదేముందని భావించి బహిరంగంగానే అడిగేందుకు సిద్ధమయ్యారు.


Tags:    

Similar News