Chandrababu : చంద్రబాబులో పెనుమార్పునకు కారణాలేంటి? అదే రీజన్ అయ్యుంటుందా?

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

Update: 2025-07-22 07:01 GMT

ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. గతంలోమూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అంతా తానే అయి వ్యవహరించేవారు. ఆయన కూడా ఇతర రాజకీయ నేతల మాదిరిగానే వ్యవహరించేవారు. చంద్రబాబు పై ఒక అపవాదు కూడా ఉండేది. ఎక్కువగా అధికారులపైనే ఆధారపడి పాలన చేస్తారని. అధికారుల ఫీడ్ బ్యాక్ ప్రకారమే నడచుకుంటారనే వారు. నిజానికి అందులో నిజం లేకపోలేదు. 1995 లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు అయిన నాటి నుంచి 1999లో, 2014లో గాని అధికారులే చంద్రబాబు పాలనలో ఎక్కువగా పెత్తనం చెలాయించేవారు. ఎన్నికయిన ప్రజాప్రతినిధులు నామమాత్రంగా ఉండేవారు.

అధికారులపైనే...
ప్రజలు ఏమనుకుంటున్నారన్న ఫీడ్ బ్యాక్ ను కూడా అధికారుల నుంచి తీసుకునే వారు. అందుకే తరచూ ఆయన గతంలో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేవారు. వారంలో ఒకరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రాష్ట్రంలో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే వారు. ఇటు జిల్లా కలెక్టర్లు, అటు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు చెప్పిన మాటలనే చెవికి ఎక్కించుకునే వారు. క్షేత్రస్థాయిలో తిరిగే నేతలను పెద్దగా పట్టించుకునే వారు కారు. వారితో సమావేశమ య్యేందుకు కూడా ఇష్టపడే వారు. వారికి సమయం కూడా కేటాయించే వారు కాదు. దీంతో తమకు కావాల్సిన పనులు చేయించుకోవడానికి ముఖ్యమంత్రి కార్యాలయం పైనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆధారపడే వారు.
ఎమ్మెల్యేలతో ముఖాముఖి...
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి తలెత్తింది. అనేక మంది పార్టీ నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు తమను కలిసేందుకు కూడా చంద్రబాబు సమయం ఇచ్చేవారు కాదంటూ విమర్శలు చేశారు. కానీ 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు లో పెను మార్పు కనిపిస్తుంది. తరచూ ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరస భేటీలు జరుపుతున్నారు. ఈరోజు నరసరావుపేట, పాతపట్నం ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. రోజువారీ షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజుకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమవుతున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.
కార్యకర్తలతో సమావేశాలు...
ఇప్పటివరకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, నియోజకవర్గంలో సమస్యలు-పరిష్కారాలు, పార్టీ పదవులపై వంటి ప్రధాన అంశాలు అజెండాగా భేటీ జరగనుంది. నియోజకవర్గాల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతున్న తీరు, ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వారికి అండగా నిలబడతానని భరోసా ఇస్తున్నారు. మరొకవైపు లోకేశ్ కూడా కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తుండంతో 2024 తర్వాత చంద్రబాబు పాలనలో పెనుమార్పులు జరిగినట్లు కనపడుతుంది.


Tags:    

Similar News