Free Bus : మహిళలకు ఉచిత బస్సు పై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు సౌకర్యాన్ని అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఖర్చయినా, ఖజానాపై ఎంత భారం పడినా ఆగస్టు పదిహేనో తేదీన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని చంద్రబాబు ప్రకటించారు.ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేసిన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఖజానాకు భారం అయినా..
ఈ పథకం ఇప్పటికే అమలులో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తెలంగాణలో కొంత సక్సెస్ గా కనిపిస్తున్నప్పటికీ, కర్ణాటకలో మాత్రం సర్కార్ కు ఈ పథకం భారంగా మారింది. ఈ రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత మహిళ బస్సు అమలు చేయడంతో ఆర్టీసీకి నష్టం వచ్చి, వాటిని భరించేందుకు ఇతర ఛార్జీలను పెంచుతున్నారు. అలా కాకుండా పూర్తిగా ఈ నెలలో ఉచిత బస్సు అమలవుతున్న అన్ని రాష్ట్రాల్లో మరోసారి అధ్యయనం చేయాలని నిర్ణయించారు. అయితే ఇందుకోసం విద్యుత్తు బస్సులను ఎక్కువగా వినియోగించాలని, ఇప్పుడున్న బస్సులనూ ఈవీలుగా మార్చేందుకు ప్రయత్నించాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అధ్యయనం చేసిన తర్వాత...
ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చంద్రబాబు రవాణా శాఖ అధికారులను కోరారు. ఖర్చు తగ్గేలా అలాగే ప్రయాణం సాఫీగా సాగేలా ప్రణాలళికలను రూపొందించాలని చంద్రబాబు ఆదేశించారు. ఆర్టీసీయే విద్యుత్తు ఉత్పత్తి చేసి బస్సులను నడపటం ద్వారా ఖర్చు ఏ మేరకు తగ్గించుకోవచ్చో కూడా పరిశీలించాలని సూచించారు. నిర్వహణ వ్యయం కూడా అంచనా వేయాలని కోరారు. ఈ పథకం అమలు చేయడానికి 2,536 అదనపు బస్సులు అవసరం అవుతుందని ఆర్టీసీ అధికారులు లెక్క తేల్చారు. ఇందుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెప్పారు. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పథకం ప్రారంభం నుంచే మంచి ఫీడ్ బ్యాక్ రావాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు.