Chandrababu : చంద్రబాబు హెచ్చరికలు నేతలపై పనిచేస్తాయా? వార్నింగ్ లతో సమసిపోయేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసి మీద ఉన్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారు

Update: 2025-08-21 07:56 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసి మీద ఉన్నారు. పార్టీ నేతల మధ్య విభేదాలను తొలగించేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగుతున్నారు. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నేతల మధ్య తగాదాలను పరిష్కరించాలన్న భావనలో ఉన్నారు. నేతల మధ్య తలెత్తుతున్న విభేదాలు చివరకు పార్టీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారనున్నాయి. క్యాడర్ కూడా రెండుగా విడిపోవడం వల్ల ప్రత్యర్థులు లాభపడతారు. ఆ అవకాశం ఇవ్వకూడదన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఎక్కడ ఏ చిన్న వివాదం తలెత్తినా ఆయన నేరుగా ఎంట్రీ ఇచ్చి విభేదాలను పరిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. నివేదికలు కోరుతున్నారు.

అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో...
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అక్కడ ప్రభాకర్ చౌదరికి, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ కు మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. సీటు దక్కకపోయినా తాను దగ్గుబాటి ప్రసాద్ విజయం కోసం పనిచేసినా గెలిచిన తర్వాత తన అనుచరులను అణగదొక్కుతున్నారన్న అభిప్రాయం ప్రభాక్ చౌదరిలో ఉంది. అదేసమయంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. రాష్ట్రంలోని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఏకమై అనంతపురం ఎమ్మెల్యే నివాసం ఎదుట ఆందోళనకు దిగారు. దీని వెనక ప్రభాకర్ చౌదరి ఉన్నారంటూ దగ్గుబాటి ప్రసాద్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరినీ పిలిచి చంద్రబాబు నాయుడు క్లాస్ పీకినట్లు తెలిసింది.
కూన రవికుమార్ విషయంలోనూ...
ఇక శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కూడా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయనకు అక్కడ మంత్రి అచ్చెన్నాయుడుకు మధ్య పొసగడం లేదు. అదే సమయంలో తాజాగా ఒక ప్రిన్సిపల్ బదిలీ వివాదంలో కూన రవికుమార్ చిక్కకున్నారు. ప్రిన్సిపల్ ఆత్మహత్యాయత్నం చేయడంతో అది పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కూన రవికుమార్ కొంత దూకుడుగా ఉంటారు. ఇసుక దందాలు, కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య వివాదంతో ఆయన పార్టీని ఇబ్బందుల పాటు చేస్తున్నారు. మంత్రి పదవి ఆశించిన కూన రవికుమార్ కు కనీసం కేబినెట్ ర్యాంక్ పదవి దక్కకపోవడంతో ఆయన అసహనంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ నుంచి కూడా చంద్రబాబు నివేదికను కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలో కూనను పిలిచి చంద్రబాబు మాట్లాడతారని తెలిసింది.


Tags:    

Similar News