Chandrababu : చంద్రబాబు ఎత్తుగడ నిజమే అయితే మరో పెద్దాయనకు కూడా రాజభవన్ లోకి ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఒకవైపు సీనియర్లను పక్కన పెడుతూ అందులో ముఖ్యమైన వారిని, తొలి నుంచి పార్టీని నమ్ముకున్న వారిని ఉన్నత పదవులకు పంపేందుకు సిద్ధమయ్యారు. ఇలా సీనియర్లలోనూ అసంతృప్తి తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు చంద్రబాబుకు మంచి అవకాశం లభించింది. ఈసారి కేంద్రంలో కీలకంగా టీడీపీ మారడంతో తన మద్దతు బీజేపీ ప్రభుత్వానికి అవసరం కావడంతో ఆయన రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాజకీయ అవసరాలను కూడా ఈ సమయంలోనే తీర్చుకునే పనిలో ఉన్నారు. ఫలితంగా పార్టీ కూడా సామాజికవర్గాల పరంగా బలంగా ఉంటుందని చంద్రబాబు ఈ ఎత్తుగడకు సిద్ధమయ్యారు.
యాక్టివ్ గా లేని...
సీనియర్ నేతలను ఇక పార్టీలో పెద్దగా యాక్టివ్ లేని వారిని గవర్నర్ పదవి ఇచ్చి పంపేయాలని నిర్ణయించారు. అందులో భాగంగానే పార్టీలో తొలి నుంచి ఉండి నీతి, నిజాయితీకి పేరొందిన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును గవర్నర్ గా ఎంపిక చేశారు. అశోక్ గజపతి రాజును గవర్నర్ పదవికి ఎంపిక చేయడంలో చంద్రబాబు పాత్రను ఎవరూ కాదనలేరు. ఆయన ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా రాజుగారి గవర్నర్ పదవి కోసం సిఫార్సుచేస్తూనే వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షావద్ద పదే పదే ప్రస్తావించడంతో చివరకు అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా రాష్ట్రపతి నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అశోక్ గజపతి రాజు కూడా గవర్నర్ పదవి దక్కినవెంటనే పార్టీ పదవులకు, సభ్యత్వానికి రాజీనామా చేశారు.
రాయలసీమ ప్రాంతానికి...
ఇక మరొక్ కీలకమైన నేతకు కూడా గవర్నర్ పదవి దక్కే అవకాశముందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. బీసీ సామాజికవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2014లో పోటీ చేసి మంత్రి పదవి చేపట్టిన కేఈ కృష్ణమూర్తి తర్వాత ఇక తన వారసులకు పదవి అప్పగించారు. ప్రస్తుతం పత్తికొండ ఎమ్మెల్యేగా కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు ఉన్నారు. కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ లో సీనియర్ నేత కావడంతో పాటు చంద్రబాబుతో సమానమైన రాజకీయ అనుభవం ఉంది. ఆయనకు గవర్నర్ పదవి ఇవ్వాలన్నది చంద్రబాబు ఆలోచన. ఈసారి కేఈని గవర్నర్ గా చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని కూడా తెలిసింది. ఇటీవల ఢిల్లీ పర్యటనలో కూడా కేఈ పేరును పెద్దల వద్ద ప్రస్తావించి వచ్చినట్లు చెబుతున్నారు.
యనమలను రాజ్యసభకు....
యనమల రామకృష్ణుడికి అవసరమైతే రాజ్యసభకు పంపాలని, కేఈ కృష్ణమూర్తిని మాత్రం గవర్నర్ పదవి ఇస్తే సరిపోతుందన్న భావనకు చంద్రబాబు వచ్చినట్లు తెలిసింది. ఒక గవర్నర్ పదవి ఉత్తరాంధ్ర కు చెందిన అశోక్ గజపతి రాజుకు ఇచ్చారు. ఇప్పటికే విశాఖకు చెందిన బీజేపీ మాజీ నేత కంభంపాటి హరిబాబుకూడా గవర్నర్ గా ఉన్నారు. ఈసారి కోటాలో రాయలసీమకు ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ప్రతిపాదనను పెట్టినట్లు తెలిసింది. అందులోనూ బీసీ సామాజికవర్గానికి చెందిన కేఈ కృష్ణమూర్తికి గవర్నర్ పదవి ఇస్తే వచ్చే ఎన్నికల్లోనూ తమకు రాజకీయంగా లాభం చేకూరుతుందని నమ్ముతున్నారు. అదే జరిగితే ఇంకో పెద్దాయనకు రాజ్ భవన్ ద్వారాలు తెరుచుకున్నట్లేనని అంటున్నారు. ఏ క్షణంలోనైనా కబురు వచ్చే అవకాశముంది. అయితే ఇప్పటికే ఏపీ నుంచి ఇద్దరు, తెలంగాణ నుంచి ఒకరు గవర్నర్ గా ఉండటంతో మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.