Chandrababu : పనితీరు పై పెదవి విరుపు.. ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై చాలా వరకూ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది.

Update: 2025-06-29 07:21 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై చాలా వరకూ అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు జనాగ్రహాన్ని ఎదుర్కొంటున్నట్లు వివిధ సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకున్న చంద్రబాబు నేడు ఎమ్మెల్యేలకు క్లాస్ పీకే అవకాశముందని తెలిసింది. జులై రెండో తేదీ నుంచి ఇంటింటికి తొలి అడుగు కార్యక్రమంపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడానికి రాష్ట్ర పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని చంద్రబాబు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కార్యక్రమంపై సూచనలు చేయనున్నారు. ప్రభుత్వం ఏడాది కాలం నుంచి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని చంద్రబాబు చెప్పనున్నప్పటికీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశముంది.

సర్వేలు చేయించి...
అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా సర్వే చేయించారు. దీంతో పాటు ప్రయివేటుసంస్థ నుంచి కూడా సర్వేలు చేయించారు. అన్నింటిలో ఎమ్మెల్యేలపై ఒకటే వ్యతిరేకత. మద్యం షాపుల్లో దందా. ఉచిత ఇసుకలో దోపిడీ. కాంట్రాక్టు పనుల్లో వైసీపీ నేతలతో లాలూచీ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను మరిచిపోయి వైసీపీ కార్యకర్తలకు కమీషన్లకోసం కక్కుర్తి పడి కాంట్రాక్టు పనులను అప్పగిస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. టీడీపీకి గత ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గాల్లో కొందరు సీనియర్ నేతలు గెలిచిన చోట్ల మినహా మిగిలిన చోట్ల దాదాపు పరిస్థితి ఇలాగే ఉందన్న సర్వే నివేదికలు చంద్రబాబును కలవరానికి గురిచేశాయంటున్నారు.
మళ్లీ టిక్కెట్ కావాలంటే...
ఎమ్మెల్యేలను ఇప్పుడు గాడిలో పెట్టకపోతే ఇక రానున్న కాలంలో మరింత రాటు దేలి పోయి పార్టీ మరింత డ్యామేజీ అవుతుందని భావించిన చంద్రబాబు ఈ సమావేశంలో వారిపై సీరియస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మళ్లీ టిక్కెట్ కావాలంటే పనితీరు ఆధారంగానే ఎంపిక చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. పనితీరు బాగాలేకపోయినా, ఆరోపణలతో పాటు ప్రజా వ్యతిరేక ఉన్నట్లు కనిపడితే నిర్దాక్షిణ్యంగా పక్కన పెడతానని కూడా చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసే అవకాశముంది. ఇది ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకోవాలని, ఏదో అనుకుని ఇలాగే వ్యవహరిస్తే ఎమ్మెల్యేగా ఉన్నా నియోజకవర్గాలకు కొత్త ఇన్ ఛార్జిని ఎంపిక చేస్తానని కూడా చంద్రబాబు సంకేతాలు ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఎమ్మెల్యేల వాదన ఇలా...
అయితే ఎమ్మెల్యేలు మాత్రం కార్యకర్తలు వత్తిడి తెచ్చినందుకు తాము మద్యం, ఇసుక వంటి వాటిలో తలదూర్చాల్సి వస్తుందని అంటున్నారు. ఎక్కువ మంది వ్యక్తిగత సమస్యలతో తమ దగ్గరకు వస్తున్నారని, వాటిని పరిష్కరించడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ద్వితీయ శ్రేణి నేతలు కూడా నియోజకవర్గాల్లో ఎవరి యాపారం వారే చేసుకుంటున్నందున తాము కొన్నింటిలో తప్పనిసరి పరిస్థితుల్లో తలదూర్చాల్సి వస్తుందని, మొన్నటి ఎన్నికల్లో గెలుపునకు తామే కారణమన్న అభిప్రాయంతో ఎక్కువ మంది ఉండటంతో వారి కోర్కెలను తీర్చలేకపోతున్నామని కొందరు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. మొత్తం మీద ఎమ్మెల్యేల వాదనలో కొంత నిజమున్నప్పటికీ డ్యామేజీ అయ్యేది పార్టీ కాబట్టి వీటి నుంచి ఎలా బయటపడతారన్నది చూడాలి.


Tags:    

Similar News