Kotamreddy Sridhar Reddy : కోటంరెడ్డి హత్యకు స్కెచ్ కేసులో ట్విస్ట్ ఇదేనా?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీషీటర్లు ప్లాన్ చేసిన విషయం బయటపడి దాదాపు మూడు నెలలవుతుంది

Update: 2025-11-17 07:55 GMT

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు రౌడీషీటర్లు ప్లాన్ చేసిన విషయం బయటపడి దాదాపు మూడు నెలలవుతుంది. అయితే తనపై ఒక రాజకీయ పార్టీకి చెందిన వారు తన హత్యకు కుట్ర చేశారని అప్పట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. రౌడీషీటర్ శ్రీకాంత్ కు ప్రధాన అనుచరుడైన జగదీష్ అనే వ్యక్తి సహచర మిత్రులతో మాట్లాడుతున్న వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బే డబ్బు అంటూ వారు మద్యం మత్తులో మాట్లాడుకుంటున్న వీడియో వైరల్ అయింది. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర జరిగినట్లు తేలిందని పోలీసులు భావించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో...
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపించాలనుకుంటున్నదెవరు? వారికి డబ్బులు ఇస్తామన్నది ఎవరు? అన్నది పోలీసుల విచారణ చేపట్టారు. కోటంరెడ్డి అనుచరులు మాత్రం తమ ఎమ్మెల్యే ను హత్య చేయడానికి వైసీపీ ముఖ్యనేత ఒకరు ప్లాన్ చేశారని చెబుతున్నారు.. అయితే మూడు నెలలవుతున్నా ఆ వైసీపీ ముఖ్య నేత ఎవరన్నది బయటకు రాలేదు. సింహపురి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ ఘటన పై ఆ వైసీపీ నేతలు ఎవరన్నది ఇప్పటికీ తేలలేదు. కోటంరెడ్డి అనుచరులు చేసిన ఆరోపణల్లో నిజం లేదా? లేకపోతే పోలీసులు ఎందుకు ఇంతవరకూ ఆ నేతను బయటకు తీసుకురాలేకపోయారన్న ప్రశ్న వినపడుతుంది. అయితే పోలీసుల విచారణలో మాత్రం రౌడీషీటర్లు మాత్రమే స్కెచ్ వేసినట్లు తేలిందని చెబుతున్నారు.
వైసీపీ ముఖ్య నేత అంటూ...
తనను చంపేందుకు వైసీపీ నేతలు కొందరు కుట్ర చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో చెప్పారు. దీనిపై నెల్లూరు జిల్లా ఎస్పీకూడా స్పందించారు. తాము కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూశామని, రౌడీ షీటర్ శ్రీకాంత్ అనుచరుడు జగదీష్ ఈ వ్యాఖ్యలు చేయడం వెనక ఎవరున్నారన్న దానిపై తాము దర్యాప్తు చేస్తామని చెప్పారు. కానీ నెలలు గడుస్తున్నా తేలకపోవడంతో వైసీపీ నేత హస్తం ఉన్నది ఉత్తదేనని తేలిపోయిందని ఫ్యాన్ పార్టీ నేతలు అంటున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ వీడియోను ఉపయోగించుకున్నారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై హత్యకు స్కెచ్ రౌడీషీటర్ల పనేనని అనుకోవాల్సి ఉంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.




Tags:    

Similar News