Chandrababu : నేడు వారి ఖాతాల్లో ఇరవై వేలు.. స్వయంగా పథకాన్ని ప్రారంభించనున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది.

Update: 2025-04-26 04:35 GMT

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుంది. ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కావడంతోఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరేవేర్చే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు లబ్దిదారులకు ఇరవై వేల రూపాయలను అందచేయనున్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఇరవై వేల రూపాయలు చేపల వేట నిషేధ సమయంలో అందచేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నేడు అమలు చేయనున్నారు.

సిక్కోలులో పర్యటించి...
శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు నాయుడు మత్స్యకారుల భరోసాను లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేపల వేట నిషేధ సమయంలో వారికి ఇరవై వేలు అందచేస్తే వారి కుటుంబాలు తిండీ తిప్పలకు ఇబ్బంది పడకుండా ఉంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఈ ఏడాది బడ్జెట్ లో నిధులను కూడా కేటాయించారు. అమరావతి నుంచిఉదయంవిశాఖకు చేరుకోనున్న చంద్రబాబు తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గంలోని బుడగట్లపాలెంలో లబ్దిదారులకు భృతిని అందచేయనున్నారు. అక్కడ మత్స్యకారులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. నేడు 1.29,975 మంది ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.
రెండు నెలల పాటు...
ప్రతి ఏడాది రెండు నెలల పాటు చేపల వేటకు విరామం ఉంటుంది. చేపలు, రొయ్యలు గుడ్లు పెడతాయి. సంతానోత్పత్తి సమయం కావడంతో చేపలవేటపై నిషేధాన్ని విధిస్తారు. రెండు నెలల పాటు వారిని ఆదుకునేందుకు ఏడాదికి ఒక్కొక్క మత్స్యకార కుటుంబానికి ఇరవై వేలు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో చేపల వేట నిషేధం సమయంలో బియ్యం పంపిణీ చేసేవారు. ఇప్పుడు నగదును ఇవ్వాలని నిర్ణయించారు. తీరప్రాంతంలో ఉన్న లబ్దిదారులందరికీ రేపు వారి ఖాతాల్లో ఇరవై వేలు పడేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మత్స్యకారులతో సమావేశం అయిన తర్వాత అక్కడే ప్రజావేదికను కూడా నిర్వహిస్తారు. తర్వాత పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమై జిల్లా పార్టీ పరిస్థితిపై ఆరా తీయనున్నారు. పార్టీని జిల్లాలో బలోపేతం చేసే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.


Tags:    

Similar News