BJP : నన్ను ఓడించండి చూద్దాం.. ఈ ఎమ్మెల్యే సవాల్ విన్నారా?
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అంతా తమ గొప్ప అని డప్పాలు కొట్టుకుంటున్నారు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అంతా తమ గొప్ప అని డప్పాలు కొట్టుకుంటున్నారు. కూటమిలోని అనేక పార్టీలకు చెందిన తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు ప్రజల్లో తమకున్న పలుకుబడి వల్లనే గెలిచామని భావిస్తున్నారు. ఈ జాబితాలోకి ఆదోని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారధి కూడా చేరిపోయినట్లుంది. ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. తాను ఎవరినీ లెక్క చేయనని, ఎలా గెలవాలో తనకు తెలుసునని, తనను ఓడించేవారు ఇక లేరని పార్ధసారధి కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించడం కాంట్రవర్సీకి దారి తీసింది. పార్ధసారధి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆదోని నియోజకవర్గం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని కూటమి పార్టీల్లోనూ ఈయన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.
పొత్తులో భాగంగా...
2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని నియోజకవర్గం బీజేపీకి వెళ్లింది. బీజేపీ తమ పార్టీ అభ్యర్థిగా పార్ధసారధిని పోటీ చేయించింది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేనకలసి పనిచేయడంతో పార్ధసారధి గెలుపొందారనడం కాదనలేని వాస్తవం. అంతకు ముందు బీజేపీలో ఒక నేతగా ఉన్న ఆయన రాత్రికి రాత్రి ఎమ్మెల్యే అయ్యారని, ఆవిషయం మర్చిపోయి మాట్లాడటం తగదని పలువురు బీజేపీ నేతలే సూచిస్తున్నారు. నాటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు కూటమిలోని అన్ని పార్టీలూ కలసి సఖ్యతగా పనిచేయడం వల్ల పార్ధసారధి గెలుపొందారని మర్చిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేసి లేనిపోని తలనొప్పులు తేవద్దంటూ కొందరు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.
ఎన్నికల నాటి నుంచి...
పార్ధసారధి ఎమ్మెల్యేగా ఎన్నికయిన నాటి నుంచి అక్కడ టీడీపీ, బీజేపీ నేతల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్యే పార్ధసారధికి, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు మధ్య విభేదాలు బహిరంగంగానే బయటపడ్డాయి. ఒకరినొకరు పరస్పరం బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. అనేక కార్యక్రమాలకు కూటమి నేతలు హాజరు కావడం లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ క్యాడర్ పార్ధసారధి గెలుపునకు సహకరించేది లేదని మీనాక్షినాయుడు వర్గీయులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి పార్ధసారధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆయన తలనొప్పిని కొని తెచ్చుకుంటున్నాడులా ఉందన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఆదోనిలో కూటమిలో వేరు కుంపట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి.