ఏపీలో పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ అంటూ వార్తలు.. నిజమిదే..!

పరీక్షా పత్రం లీక్‌ అయిందని వదంతులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు జిల్లాలో లీక్‌ విషయమై..

Update: 2022-04-27 09:14 GMT

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 పరీక్ష కేంద్రాల్లో 6 లక్షల 2 వేల 537 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో బాలికలు 3 లక్షల 2 వేల 474 మంది, 3 లక్షల 63 మంది బాలురు ఉన్నారు. కేంద్రాల వద్ద 144సెక్షన్ ను విధించి కట్టుదిట్టమైన భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షల నిర్వహణలో సమస్యలు ఎదురైతే కంట్రోల్ రూంకు తెలియజేయాలని అధికారులు కోరారు.

ఇలాంటి సమయంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి.. పరీక్షా పత్రం లీక్‌ అయిందని వదంతులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు జిల్లాలో లీక్‌ విషయమై పుకార్లు వ్యాపించడంతో అధికారులు సమాచారం కోసం పరుగులు తీస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ దృష్టికి విషయం వెళ్లడంతో ఆయన విద్యాశాఖ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ వదంతులను సృష్టించిన వారిపై డీఈవో పురుషోత్తం చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పరీక్షా పత్రం లీక్‌ అయినట్లు వచ్చిన వదంతులు నమ్మవద్దని చిత్తూరు జిల్లాలో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్‌ తెలిపారు.
పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు.


Tags:    

Similar News