Cyclone Alert : వదలని వాయుగుండాలు... తెరపివ్వకుండా తుపానులు.. ఇదేంటి సామీ?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరికొన్ని రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరికొన్ని రోజుల పాటు వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ కు మరో తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం క్రమంగా బలహీనపడుతుందని చెప్పింది. ఆగ్నేయ తూర్పు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
బలమైన గాలులు...
ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంట బలమైన ఈదురుగాలులు వస్తాయని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ప్రజలు చెట్ల కింద ఉండకూడదని, ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయని, వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించింది.
తెలంగాణలో రెండు రోజుల పాటు...
తెలంగాణలోనూ మరికొన్ని రోజుల పాటు వర్షాలు తప్పవని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 29వ తేదీన ఒకటి, నవంబరు 2వ తేదీన మరొకటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని, ఇప్పటికే అల్పపీడన ద్రోణి కొనసాగుతున్నందున మరికొన్ని రోజుల పాటు వానలు పడతాయని తెలిపింది. రెండు రోజుల పాటు తెలంగాణలో కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరికొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.