Rain Alert : ఫ్లాష్ ఫ్లడ్స్.. ముంచి ఉన్న ముప్పు..గంటల్లోనే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు కుండపోత వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో ఈ ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే తమిళనాడు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశముందని తెలిపింది.
పథ్నాలుగు జిల్లాలకు...
ఆంధ్రప్రదేశ్ లోని పథ్నాలుగు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, సత్యసాయి, కర్నూలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలెర్ట్ జారీ చేసింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ జారీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. ఎవరూ వాగులు, నదులు దాటే ప్రయత్నం చేయవద్దని కోరారు. అదే సమయంలో యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు చెట్లు, విద్యుత్తు స్థంభాలు, హోర్డింగ్ ల కింద ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
తుపాను గా మారి...
వాయుగుండం తుపాను గా మారే అవకాశముండటంతో ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ మరికొన్నిజిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రాయలసీమలోని కడప జిల్లాలోనూ బారీ వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా మహాసముద్రంలోనూ ఒక అల్పపీడనం తీవ్ర అల్పపీడనం గా మారి వాయుగుండంగా బలపడే అవకాశముందని, ఈ ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఈ జిల్లాల్లో వర్షాలు...
తెలంగాణాలోనూ మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని చెప్పింది. నారాయణపేట్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, భువనగిరి, సిద్ధిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, గంటకు ముప్ఫయి నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.