TDP : సీఆర్ కనిపించడం లేదేంటి? ఆయన మౌనానికి కారణమదేనా?

సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? అన్న అనుమానం కలుగుతుంది

Update: 2025-11-19 07:56 GMT

సీనియర్ నేత సి. రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నారా? అన్న అనుమానం కలుగుతుంది. సి.ఆర్ తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగారు. రాజ్యసభ పదవి దక్కింది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా రాజ్యసభ ఎన్నికకావడంతో ఆయన రాజకీయంగా మరింత బలపడేందుకు ప్రయత్నించారు. అయితే సీఆర్ తెలుగుదేశం పార్టీ లో ఉంటే ఎంతో కొంత గౌరవం ఉండేది. కడప జిల్లాకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ ఆయనకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే 2009 లో ఆయన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఏర్పాటు చేయడంతో అందులోకి జంప్ చేశారు.

అన్ని పార్టీలు మారి వచ్చినా...
అయితే చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో సి. రామచంద్రయ్య కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిని కూడా దక్కించుకున్నారు. చిరంజీవి వద్ద ముఖ్య నేతగా ఉండటంతో రామచంద్రయ్యకు సులువుగానే పదవి దక్కింది. తర్వాత కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు. వైసీపీ కూడా సి.రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించింది. మళ్లీ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలు కావడంతో సి.రామచంద్రయ్య తిరిగి టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా తిరిగి టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఆయన టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నారు.ఈ ఏడాది మే నెలలో మహానాడు కడపలో జరిగినా సి. రామచంద్రయ్య దానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
మండలి సమావేశాలకు...
అయితే సి.రామచంద్రయ్య కుమారుడు మరణించడంతో ఆయన కొంత మానసికంగా ఇబ్బంది పడుతున్నారని, అందుకే రాజకీయాలకుదూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాలకు మాత్రం హాజరయ్యారు. సి.రామచంద్రయ్య ఎందుకు దూరంగా ఉంటున్నారన్నది మాత్రం పార్టీ నేతలకు కూడా అర్ధం కావడం లేదు. ఆయన ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారన్నది కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. మీడియా సమావేశాలు కూడా నిర్వహిచడం లేదు. మరొకవైపు నేడు చంద్రబాబు కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సి.రామచంద్రయ్య ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అన్నది హాట్ టాపిక్ గా మారింది.


Tags:    

Similar News