జగన్ పై పయ్యావుల ఫైర్

ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేశారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు

Update: 2023-09-13 07:01 GMT

ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్ట్ చేశారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత డిపాజిట్లు కూడా కోల్పోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు సంవత్సరాల్లో స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఏం సాధించలేక చివరిఏడాది టీడీపీ క్యాడర్‌ను మానసికంగా దెబ్బతీసేందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని పయ్యావుల అన్నారు.

అక్రమ కేసులను...
అక్రమాలన్నీ నాలుగేళ్ల తర్వాత గుర్తుకొచ్చాయా? అని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఒక్క రూపాయి దారి మళ్లకపోయినా తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుందని భయపడి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చంద్రబాబు అరెస్ట్ అని పయ్యావుల కేశవ్ అభిప్రాయపడ్డారు. అధికారాన్ని కాపాడుకోవడానికి కుట్రలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందన్నారు.
కక్ష సాధింపు చర్యలు...
జగన్ కక్ష సాధింపు చర్యలు పరాకాష్టకు చేరుకున్నాయని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా ఉండేందుకు ఇంకా అనేక కేసులు పెడుతున్నారన్నారు. లోకేష్ తో పాటు ఇతర నేతలపై కూడా అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారన్నారు. జగన్ పదహారు నెలలు జైలులో ఉన్నారని, చంద్రబాబును కూడా కొన్ని రోజులు జైలులో ఉంచాలని చేసిందే తప్ప మరేదీ కాదన్నారు. ఈ కేసులో పస లేదన్నారు. ఈకేసులకు టీడీపీ బెదిరేది లేదన్నారు. న్యాయపోరాటంతో పాటు ప్రజా ఉద్యమాలు చేస్తామని కేశవ్ హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని కేశవ్ అన్నారు.


Tags:    

Similar News