సంక్షేమమే ప్రభుత్వ అజెండా

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారి ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు

Update: 2023-03-14 05:51 GMT

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తొలిసారి ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు. తొలిసారి శాసనసభకు వచ్చిన గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలికారు. జీఎస్‌డీపీలో దేశంలోనే రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందన్నారు. నాలుగేళ్లుగా పారదర్శక పాలనను అందిస్తున్నామని తెలిపారు. నవరత్నాలతో సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, వ్యవసాయం, సేవల రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించామని గవర్నర్ తెలిపారు. ఏపీలో తలసరి ఆదాయం 2.19 లక్షలకు పెరిగిందన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు...
అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నాలుగేళ్లలో మెరుగుపడిందన్నారు. డీబీటీ పద్ధతిలో లబ్దిదారులకు నేరుగా సంక్షేమ నిధులను అందిస్తున్నామని గవర్నర్ చెప్పారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా పేద ప్రజలను ఆదుకుంటున్నామని తెలిపారు. విద్యా, వైద్య రంగంలో సమూలమైన సంస్కరణలు తెచ్చామన్నారు. నాడు - నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలను మెరుగుపర్చడమే కాకుండా సేవలలో మరింత నాణ్యత పెంచామని తెలిపారు. విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా మార్పులు తీసుకు వచ్చామని గవర్నర్ చెప్పారు.
పారదర్శక పాలనను...
సమీకృత అభివృద్ధి కోసం పారదర్శక పాలనను అందిస్తున్నామని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ప్రగతిని సాధించామని గవర్నర్ తెలిపారు. ప్రతి ఏటా 11.43 శాతం జీఎస్‌డీపీలో అభివృద్ధిని సాధించామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామని తెలిపారు. 3,669 కోట్లతో పాఠశలలను ఆధునికీకరిస్తున్నామని తెలిపారు. పేద వారికి ఉచిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తుందన్నారు. ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు కూడా పేదలకు ఉచితంగా చేయిస్తున్నామన్నారు. కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన సాగుతుందని గవర్నర్ తెలిపారు.
వైద్య రంగంలో...
వైద్యరంగంలో మెరుగైన సేవలందించేందుకు పోస్టులను భర్తీ చేశామన్నారు. కొత్తగా పదిహేడు మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వైద్యుల నుంచి నర్సుల వరకూ అన్ని పోస్టులను భర్తీ చేస్తూ వస్తున్నామన్నారు. పేద ప్రజల వద్దకే వైద్యులను పంపేలా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. గర్భిణి స్త్రీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని చెప్పారు. 2024 నాటికి పేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. పేద మహిళల పేరిట పక్కా ఇంటి నిర్మాణం కోసం స్థలాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో పేదలకు ఇళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ విజయవంతమయిందన్నారు. ఈ సదస్సు ద్వారా 11.50 లక్షల కోట్ల పెట్టుబడులపై ఎంవోయూలు కుదుర్చుకున్నామని, దీని ద్వారా ఆరు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని గవర్నర్ తెలిపారు.
బలహీన వర్గాలకు...
బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. మత్స్యకారులకు, నాయీ బ్రాహ్మణులకు ఆర్థిక చేయూతను అందిస్తున్నామని తెలిపారు. వాహనమిత్ర పథకం కింద ఆటో డ్రైవర్లకు ఏడాదికి పదివేలు ఇస్తున్నామని చెప్పారు. వైఎస్సార్ లా నేస్తం పథకం కింద జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందచేస్తున్నామని చెప్పారు. వీధి వ్యాపారులకు జీరో వడ్డీ కింద రుణాలను అందచేస్తున్నామని చెప్పారు. యాభై శాతం మహిళలకు అన్నింటా రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనులలో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో విన్నూత్న తరహాలో వాలంటీర్ వ్యవస్థను రూపొందించామని తెలిపారు. లబ్దిదారుల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. రాబోయే నాలుగేళ్లలో దశలవారీగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. అయితే కొత్త గవర్నర్ కావడంతో ఆయన ప్రసంగానికి తెలుగుదేశం పార్టీ నేతలు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు.  





Tags:    

Similar News