Andhra Pradesh : బడ్జెట్ లో నిధులు సరే.. లబ్దిదారులు ఎవరంటే?
బడ్జెట్ లో అయితే నిధులు కేటాయించారు. అయితే ఈ పథకాలకు సంబంధించి నిధులు సరిపోతాయా? లేవా? అన్నదానిపై చర్చ జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ లో అయితే నిధులు కేటాయించారు. అయితే ఈ పథకాలకు సంబంధించి నిధులు సరిపోతాయా? లేవా? అన్నదానిపై చర్చ జరుగుతుంది. ఈ ఏడాది రెండు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని ప్రకటించడంతో బడ్జెట్ లో ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే రెండు పథకాలకు అరకొరగా నిధులు కేటాయించారని, ఇది దేనికి సంకేతమని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలను ఈ ఏడాది అమలు చేస్తామని ప్రకటించింది.
అన్నదాతకు...
అన్నదాత సుఖీభవ పథకానికి 6,300 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ పథకం అమలు చేయాలంటే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవసరం కాగా, 6,300 కోట్ల రూపాయలను కేటాయించడం చర్చనీయాంశమైంది. ఇక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ చెప్పలేదు. ఈ ఏడాది మాత్రం అమలు చేస్తామని చెప్పారు. అంటే వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేస్తారని భావించాలి. కేంద్ర ప్రభుత్వం జూన్ లేదా జులై నెలలో విడుదల చేసే పీఎం కిసాన్ పథకం నిధులతో పాటు అన్నదాత సుఖీ భవ పథకాన్ని కూడా అమలు చేసే అవకాశాలున్నాయి. రైతులు ఇందుకోసం మరో మూడు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
నిధుల కేటాయించినా...?
ఇక తల్లికి వందనం కార్యక్రమం ఈ ఏడాది ప్రభుత్వం అమలు చేయనుంది. మే నెల నుంచి అమలు చేస్తామని స్పష్టంగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. అయితే ఈ పథకం కింద 9,407 కోట్ల రూపాయల నిధులను మాత్రమే కేటాయించిందంటున్నారు. దాదాపు పదమూడు నుంచి పథ్నాలుగు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని చెబుతున్నారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత తక్కువ స్థాయిలో నిధులు కేటాయించడం పై పలు అనుమానాలు కలుగుతున్నాయని విపక్ష నేతలు అంటున్నారు.
రెండు పథకాలను...
ఈ రెండు పథకాలను ప్రస్తుతం బడ్జెట్ లో కేటాయించిన నిధులతో అమలు చేయాలంటే ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. ప్రధానంగా లబ్దిదారుల ఎంపికలోనే జల్లెడ పట్టే అవకాశముంది. స్పష్టమైన అర్హతలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉండటమే కాకుండా విద్యార్థుల హజరు కూడా తల్లికి వందనం పథకంలో తీసుకునే అవకాశముంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద కూడా పీఎం కిసాన్ పథకం పొందే రైతులకు మాత్రమే చెల్లించే అవకాశలున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే జమ చేస్తామని చెబుతుంది కాబట్టి ఆ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశముందని చెబుతున్నారు. ఇక కౌలు రైతులకు కూడా ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడం శుభపరిణామంగానే చూడాలి.