Andhra Pradesh Budget : సూపర్ సిక్స్ కు నిధులు కేటాయింపులు జరగనున్నాయా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు శాసనసభలో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. అందులో భాగంగా ముందుగా2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ కు విజయవాడలో ఇంటి వద్ద అధికారులతో కలసి బడ్జెట్ ప్రతులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాస్త్రోకంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, ఐఏఎస్,ఆర్థిక శాఖ కార్యదర్శి (బడ్జెట్) రోనాల్డ్ రోస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జే. నివాస్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి గౌతమ్, ఆర్థిక శాఖ ఉప కార్యదర్శి నూరుల్, ఐఏఎస్ లు పాల్గొన్నారు.
శాసనసభ సాక్షిగా...
బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి పయ్యావుల కేశవ్ బయలుదేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బడ్జెట్ ప్రతులను అందచేయనున్నారు. కెబినెట్ భేటీలో బడ్జెట్ కు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది. అయితే అందరూ ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో సూపర్ సిక్స్ హామీలకు ఎంత మేరకు నిధులు కేటాయిస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాము సూపర్ సిక్స్ హామీలను వరసగా అమలు చేస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించారు. ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ, అప్పుల భారం అధికంగా ఉన్నప్పటికీ తాము ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చంద్రబాబు చెప్పడంతో సూపర్ సిక్స్ హామీలకు కేటాయింపులు జరిగే అవకాశముంది.
హామీల అమలుపై...
ప్రధానంగా ఇప్పటికే నెలకు నాలుగు వేల రూపాయల పింఛనును కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన వెంబటనే అమలు చేస్తున్నారు. అలాగే గత ఏడాది నవంబరు నెల నుంచి దీపం 2 పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తున్నారు. ఇక ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తామని చెప్పారు. అలాగే మే నెలలో తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అందచేస్తామని చంద్రబాబు సభాముఖంగా హామీ ఇచ్చారు. దీంతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో ఈ మూడు పథకాలకు కేటాయింపులు జరిగే అవకాశముంది.