జిల్లా కలెక్టర్ల సమావేశంలో భూ పరిపాలన, ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిగింది. రవాణా,రోడ్లు భవనాల శాఖపై ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. రవాణా శాఖ ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, వార్షిక లక్ష్యాల సాధనపై వివరిస్తూ ఈ ఆర్థిక సంవత్సరం లో వాహనాల పన్నుల ద్వారా రూ. 5,930 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా మార్చి 9 నాటికి రూ. 4,501 కోట్లు అనగా 76 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని ఆయన వెల్లడించారు. గత ఐదేళ్ల ఆదాయ వృద్ధిని వివరిస్తూ.. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి మొత్తం రవాణా ఆదాయం రూ. 4,125.67 కోట్ల నుంచి రూ. 4,389.03 కోట్లకు పెరిగి 6.38% వృద్ధి నమోదైందని చెప్పారు. త్రైమాసిక పన్నుల వసూళ్లలో 2.03% వృద్ధి సాధించామని, ముఖ్యంగా వాహనాల తనిఖీల్లో ఏకంగా 71.06 శాతం అద్భుత వృద్ధి రేటును నమోదు చేశామని వివరించారు. అలాగే ఫీజులు, యూజర్ ఛార్జీలు, కేంద్ర ప్రభుత్వ నిధుల రూపంలో వచ్చే ఆదాయం కూడా 19.51% పెరిగిందని తెలిపారు.
చిత్తూరు జిల్లా ఫస్ట్...
జిల్లాల వారీగా ఆదాయ లక్ష్యాల సాధనలో సాధించిన ఫలితాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ నిర్దేశించిన ఆదాయంలో చిత్తూరు జిల్లా నూరు శాతం లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీ సత్యసాయి జిల్లా 94 శాతంతో రెండో స్థానంలో నిలవగా.. ఎన్టీఆర్ జిల్లా 92%, కర్నూలు 88%, తిరుపతి 87%, ప్రకాశం జిల్లా 87 శాతం చొప్పున ఆదాయ లక్ష్యాలను సాధించి అత్యుత్తమ పనితీరు కనబరిచిన టాప్-6 జిల్లాల జాబితాలో నిలిచాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయని, గతేడాదితో పోలిస్తే మొత్తం వాహనాల సేల్స్ లో 12.50% వృద్ధి నమోదైందని ఆయన తెలిపారు. ద్విచక్ర వాహనాలు, కార్ల వంటి నాన్-ట్రాన్స్ పోర్ట్ వాహనాల అమ్మకాల్లో 12.40 శాతం వృద్ధి కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా గూడ్స్, ప్యాసింజర్, ఆటోలు తదితర కమర్షియల్ కేటగిరీ వాహనాల అమ్మకాల్లో గణనీయమైన పురోగతి ఉందని, కేవలం ఫిబ్రవరి నెలలోనే ఏకంగా 18.37 శాతం వృద్ధిని, అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తంగా 14.24 శాతం వృద్ధిని సాధించామని ఆయన వివరించారు. ఇక వ్యవసాయ ట్రాక్టర్లు, అంబులెన్సులు, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, హార్వెస్టర్లు తదితర ఇతర వాహనాల కేటగిరీలోనూ 11.92 శాతం మేర రిజిస్ట్రేషన్లు పెరిగాయని వివరించారు.