Pawan Kalyan : పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మొంథా తుపాను ప్రభావంతో విరిగిపడిన చెట్లు, విద్యుత్తుస్థంభాలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ఈరోజు ఉదయం పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుపాను ప్రభావం పై ఆయన అధికారులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నేడు కూడా అప్రమత్తతోనే...
తుపాను తీరం దాటినప్పటికీ నేడు కూడా భారీ వర్షాలు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలన్న పవన్ కల్యాణ్ పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, వసతిని కల్పించాలని స్పష్టం చేశారు. వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టాలని, వ్యాధులు, అంటురోగాలు వ్యాప్తి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈరోజు కూడా అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడాలని ఆయన కోరారు.