Pawan Kalyan : చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి
అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు
అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతిలో ఒకేరోజు బ్యాంక్ స్ట్రీట్ ను ఏర్పాటు చేసి అందులో ఇరవై ఐదు సంస్థలకు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని తెలిపారు. రైతులు నమ్మకంతో తమ భూములను ఇచ్చారని, దాని వల్లనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని అన్నారు. చంద్రబాబు, మోదీ సారథ్యంలో అమరావతి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రపంచంలోనే అద్భుతమైన నగరంగా మారుతుందని పవన్ కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆర్థిక ప్రగతికి పునాది...
రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ కు అమరావతిని ఖరారు చేసినప్పటికీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడి రాజధాని నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి దోహద పడుతుందని అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తయితే రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈరోజు అమరావతిలో ఆర్థిక ప్రగతికి పునాది పడిందని పవన్ కల్యాణ్ అన్నారు. ఒకే ప్రాంతంలో ఇన్ని బ్యాంకులతో బ్యాంకింగ్ స్ట్రీట్ ఏర్పాటు కావడం దేశంలోనే మొదటి సారి అని పవన్ కల్యాణ్ అన్నారు.